గ్రేటర్‌ జిల్లాల్లో 43 లక్షల ఓటర్ల తొలగింపు! | 43 lakh voters removed from Greater Hyderabad districts | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ జిల్లాల్లో 43 లక్షల ఓటర్ల తొలగింపు!

Aug 18 2026 2:20 AM | Updated on Aug 18 2026 2:20 AM

43 lakh voters removed from Greater Hyderabad districts

ముసాయిదా విడుదల చేస్తున్న సీఈఓ సుదర్శన్‌రెడ్డి

తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 

3.68 కోట్ల నుంచి 2.64 కోట్లకు తగ్గిన ఓటర్లు

ఫారాలివ్వని 73,39,235 మంది తొలగింపు 

43 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వారే 

92,87,577 మందికి నోటీసులు! 

వీరిలో 32,36,659 మంది అన్‌మ్యాప్డ్‌.. 60,50,918 మంది వ్యత్యాసాలున్న ఓటర్లు 

విచారించనున్న 119 ఈఆర్వోలు, 892 మంది ఏఈఆర్‌వోలు 

విలేకరుల సమావేశంలో  సీఈఓ సి.సుదర్శన్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్‌), 2026లో భాగంగా సోమవారం రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ‘సర్‌–2026’ప్రక్రియ చేపట్టడానికి ముందు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, తాజాగా ప్రకటించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,87,213కు తగ్గిపోయింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) సి.సుదర్శన్‌ రెడ్డి సోమవారం తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఆచూకీ లేరు/శాశ్వతంగా నివాసం మారారు/చనిపోయారు/మరో చోట ఓటుకలిగి ఉన్నారు(ఏఎస్‌డీడీ) ..అనే కారణాలతో ఏకంగా 73,39235 మంది(21.7శాతం) ఓటర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో తొలగించారు. శాతాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలో సగటున 21.7 శాతం ఓటర్లను తొలగించగా..హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 40.99శాతం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 35.97శాతం, రంగారెడ్డి జిల్లాలో 34.79శాతం, ఓటర్లను తొలగించారు. 

సంఖ్యాపరంగా పరిశీలిస్తే హైదరాబాద్‌ జిల్లాలో 19,41,444 మంది, రంగారెడ్డి జిల్లాలో 12,87,091 మంది, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 10,71,566 మంది కలిపి ఈ మూడు జిల్లాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏకంగా 43,00,101 మంది ఓటర్లను తొలగించారు. రాష్ట్రంలో తొలగించిన 73,39235 మంది ఓటర్లలో 58.59 శాతం ఓటర్లు ఈ మూడు జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ..అత్యధికంగా ముషీరాబాద్‌లో 45.17%, సనత్‌నగర్‌లో 44.93%, మలక్‌పేటలో 44.76%, ఎల్బీనగర్‌లో 44.44%, జూబ్లీహిల్స్‌లో 44.14% శాతం ఓటర్లను తొలగించారు. సంఖ్యాపరంగా చూస్తే శేరిలింగంపల్లి 3,29,828, కుత్బుల్లాపూర్‌లో 2,76,924, ఎల్బీనగర్‌లో 2,70,284, రాజేంద్రనగర్‌లో 2,47,005, మహేశ్వరంలో 2,35,331, ఉప్పల్‌లో 2,18,323, మేడ్చల్‌లో 2,13,122 మంది ఓటర్లను తొలగించారు.  

92,87,577 మందికి నోటిసులు... 
ముసాయిదా జాబితాలోని 2,64,87,213 మంది ఓటర్లలో ఏకంగా 92,87,577 మంది(35.06%) ఓటర్ల పేర్లు ఆక్టోబర్‌ 19న ప్రకటించే తుది ఓటర్ల జాబితాలో వస్తుందో రాదో అనుమానమే. ‘సర్‌’ప్రక్రియలో భాగంగా సమర్పించిన ఎన్యూమరేషన్‌ ఫారంలో సర్‌–2002 ఓటర్ల జాబితాలో తమ పేరు/తమ తల్లిదండ్రులు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది(12.22శాతం) ఓటర్లు ఈ వివరాలను అందించలేదు. దీంతో వారిని 2002 సర్‌ జాబితాలో అనుసంధానం కాని(అన్‌మ్యాప్డ్‌) ఓటర్లుగా గుర్తించారు. ఇక ఫారంలో ఈ వివరాలిచ్చిన వారిలో 60,50,918 మంది(22.84%) మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్లు నిర్థారించారు. అంటే, ప్రస్తుత ఓటర్ల జాబితాలో పోల్చితే 2002 ఓటర్ల జాబితాలోని వీరి వివరాల్లో 11 రకాల వ్యత్యాసాలున్నాయని సీఈఓ సి.సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఈ రెండు కేటగిరీలు కలిపి మొత్తం 92,87,577 మంది(35.06%) ఓటర్లకు స్థానిక ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు(ఈఆర్వోలు), ఏఈఆర్‌లు నోటిసులు జారీ సంజాయిషీ కోరనున్నారు. స్థానిక బీఎల్‌ఓలే సంబంధిత ఓటర్లకు నోటిసులు తీసుకొచ్చి ఇస్తారని, రాతపూర్వక సంజాయిషిని వారికి లేదా స్థానిక ఈఆర్వోకు సమర్పించాలని ఓటర్లకు సూచించారు. ప్రత్యక్ష విచారణ అవసరమైన ఓటర్లను మాత్రం నిర్దేశిత తేదీకి పిలిపించి విచారిస్తారని సీఈఓ వెల్లడించారు.  

విచారణపై ఈఆర్వోలకి విచక్షణాధికారాలు 
నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ 11 రకాల పత్రాలే అంతిమం కాదని, చట్టబద్ధంగా జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను స్వీకరించే విషయంలో విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు చట్టబద్ధంగా కల్పించినట్టు ఆయన తెలిపారు. అక్టోబర్‌ 15లోగా విచారణ ప్రక్రియ పూర్తి చేస్తారన్నారు. ఒక వేళ సమయం సరిపోకుంటే గడువు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు. రాష్ట్రంలో 119 మంది ఈఆర్వోలు, 890 మంది ఏఈఆర్‌ఓలుండగా, విచారణ వేగీరం కోసం 500–1000 మంది అదనపు ఏఈఆర్‌ఓలను సైతం నియమించాలని ఈసీని కోరుతామన్నారు.  

నోటీసులకు సమాధానం ఇవ్వాలి 
నోటీసులు అందుకోనున్న ఓటర్లు తప్పనిసరిగా నిర్దేశిత గడువులోగా వివరణ ఇవ్వాలని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి కోరారు. లేకుంటే వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో తొలగిస్తారన్నారు. 2013 జూన్‌ 25న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో ఆధారంగా గత జూలై 25కి ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లను సైతం నోటీసులు అందుకున్న ఓటర్లు రుజువుగా సమర్పించవచ్చన్నారు. గత జూలై 25న విడుదల చేసిన జీవో ఆధారంగా జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్ట్రర్‌ సర్టిఫికేట్లను స్వీకరించవద్దని ఈసీ కోరిందన్నారు.  

కొత్త ఓటర్ల నమోదు మళ్లీ షురూ.. 
సర్, 2026 ప్రక్రియ ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకి ఫారం–6 దరఖాస్తుల స్వీకరణను నిలుపుదల చేసిన ఎన్నికల సంఘం..సోమవారం నుంచి మళ్లీ పునరుద్ధరించింది. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6దరఖాస్తుతో పాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్‌ 16వరకు స్వీకరించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు రాని ఓటర్లు తుది ఓటర్ల జాబితాలో చోటు సాధించడం కోసం ఫారం–6 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి సూచించారు.  

తొలగించిన ఓటర్ల జాబితా ఏదీ? 
సర్‌ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు తొలగించిన ఓటర్ల(ఏఎస్‌డీడీ) జాబితాను సోమవారం ప్రకటించాల్సి ఉండగా, ముసాయిదా జాబితాను మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఇచ్చారు. తొలగించిన ఓటర్ల జాబితాను, అనామలీస్‌/అన్‌మ్యాప్డ్‌ ఓటర్ల జాబితాలను ఆన్‌లైన్‌లో సీఈఓ కార్యాలయం ఆదివారం రాత్రివరకు విడుదల చేయలేదు. అత్యంత పారదర్శకంగా సర్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ఈసీ పేర్కొన్న నేపథ్యంలో ఈ జాబితాలను సైతం ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని విలేకరుల కోరగా, విడుదల చేస్తామని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి బదులిచ్చారు. పొరుగు రాష్ట్రం ఏపీలో సీఈఓ కార్యాలయం వెబ్‌సైట్‌లో తొలగించిన ఓటర్ల వివరాలను అందుబాటులో ఉంచారు. అందులో ఏ ఓటరును ఏ కారణంతో తొలగించారో అనే సమాచారం సైతం పొందుపరిచారు.  

ఇతర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్ల తొలగింపు 
తొలగించిన ఓటర్లు 73లక్షలు, అన్‌మ్యాప్డ్, వివరాల్లో తేడాలున్న ఓటర్లు 92 లక్షలు కలిపితే 1.66 కోట్ల మంది ఓటర్లు కానున్నారు. మొత్తం 3.38 కోట్లలో వీరి శాతం 49.15 కానుంది. రాష్ట్రంలో దాదాపుగా 50శాతం మంది ఓటర్లు తొలగింపు ముప్పును ఎదుర్కొంటున్నారు..సర్‌ ప్రక్రియ నిర్వహణలో లోపాలతోనే ఇలా జరిగిందనే విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఈఓ సుదర్శన్‌ రెడ్డి స్పందిస్తూ ఇతర రాష్ట్రాల్లో సైతం భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిందని ఉటంకించారు. సెప్టెంబర్‌ 16 వరకు ఉన్న దరఖాస్తులు/అభ్యంతరాల సమయంలో లోపాలను సరిచేయడానికి అవకాశం ఉందన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement