కేబీఆర్‌ పార్కు చుట్టూ కొత్త మార్పులు.. 7 అండర్‌పాస్‌లు.. 7 ఫ్లైఓవర్లు | Hyderabad KBR Park H-City Project Traffic Flyovers Underpasses | Sakshi
Sakshi News home page

కేబీఆర్‌ పార్కు చుట్టూ కొత్త మార్పులు.. 7 అండర్‌పాస్‌లు.. 7 ఫ్లైఓవర్లు

Aug 17 2026 1:23 PM | Updated on Aug 17 2026 1:27 PM

Hyderabad KBR Park H-City Project Traffic Flyovers Underpasses

కేబీఆర్‌ పార్కు చుట్టూ కొనసాగనున్న నిర్మాణాలు

రేపటి నుంచి ఆయా మార్గాల్లో వన్‌– వే విధానం

నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్కు చుట్టూ ‘హెచ్‌–సిటీ’ ప్రాజెక్టులో భాగంగా రూ.1,090 కోట్లతో చేపట్టనున్న పనులు రెండు ప్యాకేజీల్లో జరుగుతాయని నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ ఆదివారం ప్రకటించారు. ఇందులో భాగంగా ఆరు జంక్షన్లలో ఏడు చోట్ల అండర్‌పాస్‌లు, మరో ఏడు చోట్ల ఫ్లైఓవర్లు కానున్నాయని పేర్కొన్నారు. ఈ పనుల నేపథ్యంలో అమలు చేస్తున్న వన్‌– వే మంగళవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. రెండేళ్ల పాటు కొనసాగే ఈ పనుల నేపథ్యంలో వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.

‘హెచ్‌–సిటీ’ పనులు ఇలా..
ప్యాకేజీ–1 (3 జంక్షన్లు): (జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్, కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్, ముగ్ధ) కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్‌–ముగ్ధ జంక్షన్ల వద్ద: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి క్యాన్సర్‌ హాస్పిటల్‌ వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్‌ కోసం కేబీఆర్‌ ఎంట్రన్స్‌ వద్ద 330 మీటర్ల పొడవుతో రెండు లైన్ల అండర్‌పాస్‌. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు వెళుతూ కుడిపైపు తిరిగే వాహనాల కోసం కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్‌ వద్ద 900 మీటర్ల పొడవుతో మూడు లైన్ల ఫస్ట్‌ లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌. కేబీఆర్‌ ఎంట్రన్స్‌ నుంచి పంజాగుట్ట వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్‌ కోసం ముగ్ధ జంక్షన్‌ వద్ద 260 మీటర్ల పొడవుతో మూడు లైన్ల అండర్‌పాస్‌.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్‌ వద్ద: రోడ్‌ నం. 45 జంక్షన్‌ నుంచి కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్, యూసుఫ్‌గూడ వైపు వెళ్లే, అక్కడ కుడిపైపు తిరిగే ట్రాఫిక్‌ కోసం 740 మీటర్ల ‘వై ఆకారపు’ (4/3/2 లేన్ల) అండర్‌పాస్‌. కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్‌ నుంచి రోడ్‌ నం. 36 వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్‌ కోసం 745 మీటర్ల పొడవుతో నాలుగు లైన్ల లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్‌ నం.45 వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్‌ కోసం 770 మీటర్ల పొడవుతో రెండు లైన్ల సెకండ్‌ లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌.

ప్యాకేజీ–2 (4 జంక్షన్లు) 
(రోడ్‌ నం.45, ఫిలింనగర్, అగ్రసేన్, బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌) 
రోడ్‌ నం.45: ఫిలింనగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్‌ కోసం 290 మీటర్ల పొడవుతో రెండు లైన్ల అండర్‌పాస్‌. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి రోడ్‌ నం. 45 వైపు కుడివైపు వెళ్లే వాహనాల కోసం 500 మీటర్ల పొడవుతో రెండు లైన్ల ఫస్ట్‌ లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌.

ఫిలింనగర్‌: అగ్రసేన్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నం.45 వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్‌ కోసం 430 మీటర్ల పొడవుతో అండర్‌పాస్‌. ఫిలింనగర్‌ వైపు నుంచి వస్తూ అగ్రసేన్‌ చౌరస్తా వద్ద కుడివైపునకు తిరిగే ట్రాఫిక్‌ కోసం 600 మీటర్ల పొడవుతో రెండు లైన్ల ఫస్ట్‌ లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌.

అగ్రసేన్‌ జంక్షన్‌: బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ నుంచి ఫిలింనగర్‌ వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్‌ కోసం 410 మీటర్ల పొడవుతో రెండులైన్ల అండర్‌పాస్‌. ఫిలింనగర్‌ నుంచి రోడ్‌ నం.12 వైపు కుడివైపు తిరిగే వాటి కోసం 590 మీటర్ల రెండు లైన్ల ఫస్ట్‌ లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌: బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌: కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్‌ నుంచి వస్తూ అగ్రసేన్‌ చౌరస్తా వైపు వెళ్లే ట్రాఫిక్‌ కోసం 330 మీటర్ల పొడవుతో రెండు లైన్ల అండర్‌పాస్‌. అగ్రసేన్‌ చౌరస్తా నుంచి రోడ్‌ నం.10 వైపు వెళ్లే ట్రాఫిక్‌ కోసం 540 మీటర్ల పొడవుతో ఫస్ట్‌ లెవెల్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌.

ప్రయాణ ఇబ్బందులకు చెక్‌.. 
హెచ్‌–సిటీ ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్, రోడ్‌ నం. 45, ఫిలింనగర్, అగ్రసేన్, క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్ల వద్ద 100 శాతం, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద 80 శాతం మేర ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయి.
– సజ్జనర్, నగర సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement