పట్టాలపై మృత్యుఘంటికలు | Increasing accidents on railway tracks | Sakshi
Sakshi News home page

పట్టాలపై మృత్యుఘంటికలు

Jun 3 2025 7:26 AM | Updated on Jun 3 2025 7:27 AM

Increasing accidents on railway tracks

రైల్వేట్రాక్‌లపై పెరుగుతున్న ప్రమాదాలు

పట్టాలు దాటుతూప్రమాదాల బారిన పడుతున్న వైనం

సెల్ఫీలు, రీల్స్‌ మాయలో పడి మృత్యువాత 

ఎంఎంటీఎస్, సబర్బన్‌ మార్గాల్లోనే ఎక్కువ 

సాక్షి, హైదరాబాద్: పట్టాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. పట్టాలు దాటుతూ  రైళ్లు ఢీకొని కొందరు, బలవన్మరణాలకు పాల్పడుతూ  మరికొందరు  పట్టాలపైనే  ప్రాణాలు  కోల్పోతున్నారు. ఏటా పెరుగుతున్న  ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్‌లకు  రెండు వైపులా సరైన రక్షణ వ్యవస్థలు, కంచెలు లేకపోవడం వల్ల ప్రజలు  యథేచ్చగా పట్టాలు  దాటేస్తున్నారు. మరోవైపు ట్రైన్‌ తమను చేరే లోపు  ట్రాక్‌ దాటేయొచ్చనే  అతివిశ్వాసం కూడా   నిండు ప్రాణాలను  హరిస్తోంది. నగరంలోని  ఎంఎంటీఎస్, సబర్బన్‌ ప్రాంతాల్లోనే  అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లు  రాకపోకలు సాగించే ట్రాక్‌లకు రెండు వైపులా కాలనీలు, బస్తీలు  ఉన్నాయి.

 రాత్రింబవళ్లు ఈ ట్రాక్‌లను  దాటుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తరచూ  ప్రమాదాలకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వేలోని  జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌  పోలీసులు, అధికారుల అంచనాల  ప్రకారం  ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు  450 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతి రోజు సగటున మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు  అధికారులు  తెలిపారు. నిజానికి రైల్వే భద్రతా చట్టాల ప్రకారం  పట్టాలు దాటడం నేరం. కానీ  నగరంలోని వివిధ ప్రాంతాల్లో  కాలనీలు, నివాస సముదాయాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు, పట్టాలు దాటవలసిన చోట  ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి వంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పట్టాలు  దాటాల్సి వస్తోందని  వివిధ ప్రాంతాలకు  చెందిన ప్రజలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పట్టాలను దాటుతూ ప్రమాదాల బారినపడాలని ఎవరూ కోరుకోవడం లేదు. 

కానీ ఇవి తమ దైనందిన జీవితంలో భాగమమయ్యాయి.’’ అని డబీర్‌పూరా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌  అభిప్రాయపడ్డారు. ఒక్క డబీర్‌పురా, ఉప్పుగూడ, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలే కాదు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, మేడ్చల్, మల్కాజిగిరి, చర్లపల్లి, ఉందానగర్, బీహెచ్‌ఈఎల్, సికింద్రాబాద్‌ వంటి అనేక చోట్ల పట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

మలుపులు...మృత్యు పిలుపులు 
‘‘లింగంపల్లి నుంచి  సికింద్రాబాద్‌ వైపు వచ్చే క్రమంలో నేచర్‌క్యూర్‌ హాస్పిటల్, భరత్‌నగర్, హఫీజ్‌పేట్, తదితర చోట్ల ట్రాక్‌ మలుపులు ఉన్నాయి. ఈ రూట్‌లో ట్రైన్‌ దగ్గరకు వచ్చే వరకు గుర్తించడం కష్టం. ట్రైన్‌ వచ్చేలోపు  దాటేయవచ్చునని భావిస్తారు. ట్రైన్‌  శబ్దాన్ని విని చాలా దూరంగా ఉందనుకుంటారు. కానీ  కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే  అది వందల మీటర్ల దూరం పరుగులు  తీస్తుంది.’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు  చెప్పారు. ఈ మలుపుల వద్దనే  ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఆత్మహత్యలకు  పాల్పడేందుకు ట్రాక్‌లను ఆశ్రయిస్తున్నారు. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లి  ప్రాణాలు కోల్పోతున్నారు.‘‘ ట్రైన్‌కు ఎదురుగా మనిషి ఉన్నట్లు గుర్తించి  బ్రేక్‌  అప్లయ్‌  చేస్తాం, కానీ అది కనీసం కిలోమీటర్‌  దూరంలో ఆగుతుంది. అప్పటికే  ఆ వ్యక్తిని రైలు ఢీకొంటుంది.’’ అని ఎంఎంటీఎస్‌ లొకోపైలెట్‌  ఒకరు ఆవేదన  వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 189 మంది  ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

సోషల్‌ మీడియా మేనియా.... 
సామాజిక మాధ్యమాల పిచ్చి కూడా నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. ట్రాక్‌లపైన నించొని రకరకాల  రీల్స్‌ చేస్తున్నారు. రైళ్లకు ఎదురెళుతూ వీడియోలు తీసి  ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా వంటి వేదికల్లో తమ సాహసకృత్యాలను ప్రదర్శించుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ యువత  ఇలాంటి సోషల్‌ మీడియా మేనియాలో పడి  ప్రాణాలను  కోల్పోతున్నారు. ఇటీవల ఓ  యువకుడు సనత్‌నగర్‌ వద్ద పరుగులు తీస్తున్న ఎంఎంటీఎస్‌  పక్కన నించొని ఫొటోలు, వీడియోలు తీసుకొనేందుకు ప్రయతి్నంచి రైలు ఢీకొనడంతో చనిపోయాడు. ఫుట్‌బోర్డుపైన నిలుచుని గాలిలో ఊగుతూ వీడియోలు  తీస్తూ దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. ‘‘ తాము పట్టాల పక్కనే నించున్నాం. ప్రమాదం లేదనుకుంటారు. కానీ ట్రైన్‌ వెడల్పును అంచనా వేయలేరు.అలా ఢీకొని చాలా ప్రమాదాలు జరిగాయి.’’ అని ఆరీ్పఎఫ్‌  సిబ్బంది ఒకరు తెలిపారు.

రైలు ఢీకొని అన్నదమ్ముల దుర్మరణం
కాచిగూడ: రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్‌ కమల్‌ కుటుంబంతో కలిసి సమీపంలోని రైలు పట్టాల వద్ద నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన మహ్మద్‌ షాబుద్దీన్‌ (26) ఎలక్ట్రికల్‌ షాపులో వర్కర్‌గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు మహ్మద్‌ ఫైజల్‌ (21) వెల్డింగ్‌ వర్కర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం అన్నదమ్ములిద్దరూ గడ్డికోసం పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచి్చన రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్వా«దీనం చేసుకున్న రైల్వే పోలీసులు  పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement