Revanth Reddy
పరకాల: అసెంబ్లీ పెట్టు వస్తామని బావ, బావమరుదులు అడుగుతున్నారని కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాలు పెడతానని.. బావ, బావమరుదులు కలిసి కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని సవాలు విసిరారు.
హనుమకొండ జిల్లాలోని పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రజల మీద ఆధిపత్యం చేసేవారిని వరంగల్ ప్రజలు బొందపెట్టారు. కాకలు తీరిన నేతలను యశస్విని భారీ తేడాతో ఓడించారు. మిమ్మల్ని ఓడించేవాళ్లు లేరనుకున్న వాళ్లను పాతరేశారు. ఎప్పటికీ అధికారం మాదే అనుకునేవారిని ప్రజలు ఓడించారు. వ్యవసాయాన్ని పండుగలా చేశాం. మా హయాంలో వరి పండించిన రైతులకు బోనస్ ఇచ్చి ధాన్యం కొన్నాం.
కేసీఆర్ పాలనలో ఒక్క మహిళకు కూడా పదవి ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. విడతలవారీగా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిరుద్యోగులను రెచ్చగొట్టాలని బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ రక్తదానం నిర్వహించింది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా రక్తం ఇవ్వలేదు’’ అని చెప్పారు.


