
భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పోటెత్తిన వరద
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లెత్తటంతో ఉగ్రరూపం.... నీట మునిగిన పరీవాహక ప్రాంతాలు.. ఎంజీబీఎస్ మూసివేత
లోలెవెల్ వంతెనలు క్లోజ్.. వాహనాల దారిమళ్లింపు
వేలమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
శనివారం సాయంత్రానికి తగ్గిన వరద ఉధృతి
మంజీర ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఏడుపాయల గుడి ప్రసాదం కౌంటర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా/పాపన్నపేట(మెదక్): హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వణికించింది. దాదాపు మూడు దశాబ్దాలలో ఎన్నడూ చూడని విధంగా ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తటంతో శుక్రవారం సాయంత్రం నుంచి నది గట్టుదాటి ప్రవహించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల గేట్లను ఒకేసారి ఎత్తడంతో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా వరద వచ్చి నగరంపై పడింది. దీంతో ఎన్నడూలేని విధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)ను వరద ముంచెత్తిన విషయం తెలిసిందే.
శనివారం కాస్త శాంతించినప్పటికీ వరద ఉధృతి కొనసాగింది. ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలైన బాపూఘాట్ నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జి వరకు అనేక లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. మూసానగర్, శంకర్‌నగర్, మలక్‌పేట తదితర చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరటంతో దాదాపు 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చాదర్‌ఘాట్ బ్రిడ్జి, ఎంజీబీఎస్ బస్‌స్టేషన్, మలక్‌పేటలోని పునరావాస కేంద్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి సందర్శించారు. వరద నీరు చేరటంతో చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ కాజ్‌వేలను మూసివేశారు. మూసారాంబాగ్ కాజ్‌వే పక్కనే నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిని సైతం వరద నీరు తాకింది. నార్సింగి, హిమాయత్‌సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును మూసివేశారు.
మంచిరేవుల – నార్సింగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూరానా పూల్ బ్రిడ్జి వద్ద మూసీ ప్రమాదకర స్థాయికి చేరింది. శివాలయం నీటమునిగింది. ఆలయ పూజారి కుటుంబం గుడిలోనే చిక్కుకుపోవడంతో హైడ్రా సిబ్బంది క్రేన్¯ సాయంతో బయటికి తీసుకొచ్చారు. మూసీ వరద ఉధృతిపై అధికారులతో సీఎం రేవంత్ ఆరా తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

కాస్త తగ్గిన వరద
మూసీ నదికి శనివారం సాయంత్రానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. జంట జలాశయాల నుంచి మూసీలోకి వదులుతున్న వరద 36 వేల క్యూసెక్కుల నుంచి 15 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఉస్మాన్‌సాగర్ జలాశయానికి 9,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 11 గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి దిగువకు 9,284 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌కు ఎగువ నుంచి 7,000 క్యూసెక్కుల వరద వస్తుండగా, నాలుగు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 6,420 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు
రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్ష భీభత్సం
రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో శనివారం భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీర్‌శెట్టిపల్లి, సంగెంకలాన్, జీవన్గీ గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఓగిపూర్ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తూ జుట్టూరు వాగులో చిక్కుకున్న ఇద్దరు లారీ డ్రైవర్లను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. కాగ్నా నది ఉధృతికి యాలాల మండలంలోని కోకట్ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాండూరు, పరిగి, హైదరాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. విశ్వనాథ్‌పూర్ వాగు దాటే క్రమంలో కొందుర్గు మండలం వెంకిర్యాలకు చెందిన లింగమయ్య (42) కొట్టుకుపోయి మరణించాడు.
కోట్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన చింతకింది రవికుమార్ (35) కొత్తపల్లి చెరువు అలుగులో కొట్టుకుపోయిన చనిపోయాడు. బషీరాబాద్ మండలం జీవన్గీలోని కాగ్నా ఒడ్డున ఉన్న గోశాలను వరద ముంచెత్తటంతో గోవులను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. మనూరు మండలంలో 9.2 సెం.మీల వర్షపాతం రికార్డయింది.
సదాశివపేట మండలం పెద్దాపూర్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పంప్‌హౌజ్ పూర్తిగా నీట మునిగింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నీటిసరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో రహదారి కొట్టుకుపోవటంతో సదాశివపేట, టేకులపల్లి, అనంతసాగర్, మోమిన్‌పేటల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మునిపల్లి మండలంలో పంటలు నీట మునిగాయి. పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ ప్రాంతంలో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొండాపూర్ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.