
ప్రియుడు, తల్లితో కలిసి కూతురు ఘాతుకం
నిద్రమాత్రలు వేసి, మద్యం తాగించి దారుణం
శవాన్ని ఇంట్లో ఉంచి సినిమాకు వెళ్లిన వైనం..
అర్దరాత్రి తరువాత ఏదులాబాద్ చెరువులో శవాన్ని పడేసి ఇంటికి..
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
మల్కాజ్‌గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్‌స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండగా, శారద జీహెచ్‌ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు.
వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్‌లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్‌కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
ముగ్గురూ కలిసి ...
లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.
కల్లులో నిద్ర మాత్రలు కలిపి...
లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్‌లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు.
సినిమాకు వెళ్లి..క్యాబ్‌లో శవాన్ని తరలించి..
హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్‌పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్‌లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్‌కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్‌పై వెనుక అనుసరించి..
శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్‌పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది.
ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.