పెళ్లి పేరుతో ఎర... రూ.3.5 కోట్ల టోకరా | Businessman alleges woman duped him of Rs 3.5 crore with false marriage promise | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో ఎర... రూ.3.5 కోట్ల టోకరా

Jul 4 2026 7:44 AM | Updated on Jul 4 2026 8:57 AM

Businessman alleges woman duped him of Rs 3.5 crore with false marriage promise

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన వ్యాపారి టి.క్రాంతి సింగ్‌ 2019లో కుటుంబ వేడుకలో పరిచయమైన హర్షితా సింగ్‌ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ.3.5 కోట్లు కాజేసిందని సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెకు అప్పటికే వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం దాచింది. అత్యవసరం, వైద్య ఖర్చులు అంటూ ఆమె, కుటుంబ సభ్యులు డాక్టర్‌ శైలేందర్‌ సింగ్, లాజ్వంతి సింగ్‌ భారీ మొత్తాలు కోరారు. బాధితుడు రుణాలు, తాకట్టు, బంగారం విక్రయం ద్వారా చెల్లించాడు. చికిత్సలపై అనుమానం రావడంతో ఆసుపత్రుల్లో విచారించి అబద్ధమని తేల్చాడు. డబ్బు తీసుకున్నట్లు అంగీకరించినప్పటికీ బెదిరించారని ఆరోపించాడు.  2024 ఆగస్టులో ఆత్మహత్యకుప్రయత్నించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

భూమి అభివృద్ధి పేరిట రూ.2 కోట్ల మోసం 
మొహమ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ (మెరిడియన్‌ హోమ్స్‌ భాగస్వామి)ను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు విశ్వనాథుల శశిధర్, చికోటి కృష్ణ, జి. వెంకటేశ్వర్‌రావు, వి. రాజ్యలక్ష్మి రూ.2 కోట్లకు మోసం చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది. నిందితులు నందిగామలో 80 ఎకరాల భూమిపై అభివృద్ధి హక్కులు ఉన్నాయని చెప్పి, 2021–2022 మధ్య మూడు విడతల్లో రూ.2 కోట్లు తీసుకున్నారు. ఎంఓయూ రాసుకున్నప్పటికీ, అసలు భూ యజమానులు హక్కులు లేవని వెల్లడించారు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా, మరో ఎంఓయూ చేసి రూ.3 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ డబ్బును వేరే అవసరాలకు మళ్లించారని తెలిసి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement