ఈ రోజుల్లో కార్పొరేట్ జాబ్ చేసే చాలామంది ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక మహిళ.. తాను ఎందుకు 9-5 ఉద్యోగాన్ని వదిలేసిందో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డిజిటల్ క్రియేటర్ అయిన అర్పిత సాహు, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో.. చిన్నప్పటి నుంచి బాగా చదవాలి, మంచి డిగ్రీ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా డబ్బు సంపాదిస్తూ బాధ్యతగా జీవించాలి అనే ఆలోచనతోనే ముందుకు సాగింది. కానీ.. కొంతకాలంగా తాను కోరుకునే జీవితం ఇదేనా అనే ప్రశ్న ఆమెను వెంటాడిందట. దీంతో ఇక తన కోసం కొంత సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది.
ఉద్యోగం వదిలేయడం అంత ఈజీగా ఏమీ అనిపించలేదని అర్పితా వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక కొంత భయంగా ఉందని, అదే సమయంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాననే ఉత్సాహం కూడా ఉందని తెలిపింది. ఇన్నాళ్లూ ఇతరులు తన నుంచి ఏం ఆశించారో అదే చేస్తూ వచ్చానని, ఇప్పుడు మాత్రం తన మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికి తనకు తానే ఒక అవకాశం ఇచ్చుకున్నానని చెప్పింది.
అర్పితా నిర్ణయంపై సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు. కొందరు మాత్రం ఉద్యోగం వదిలేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చని, కెరీర్‌లో గ్యాప్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఎక్కువ మంది మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తన మానసిక ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తూ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ధైర్యమైన విషయమని పలువురు కామెంట్లు చేశారు.


