2 నెలలు.. రూ.28 వేల కోట్ల రాబడి | An average revenue of Rs 14 thousand crore per month to Telangana | Sakshi
Sakshi News home page

2 నెలలు.. రూ.28 వేల కోట్ల రాబడి

Mar 20 2024 6:20 AM | Updated on Mar 20 2024 6:20 AM

An average revenue of Rs 14 thousand crore per month to Telangana - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నెలకు సగటున రూ.14 వేల కోట్ల ఆదాయం

జీఎస్టీ పద్దు కింద రూ.7,500 కోట్లు.. ఎక్సైజ్‌ ద్వారా రూ.3,300 కోట్లు

అప్పులు, కేంద్ర గ్రాంట్ల కింద రూ.4 వేల కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితేంటి? ఆదాయం బాగానే వస్తోందా? గతంతో పోలిస్తే తగ్గిందా? సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు లాంటి చెల్లింపులకు నెలసరి రాబడులు సరిపోతున్నాయా? ప్రభుత్వం అప్పులు తీసుకుంటోందా? తీసుకుంటే ఎంత తీసుకుంది? కేంద్రం ఏమైనా సాయం చేస్తోందా? రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కొత్తగా అధికారం చేపట్టిన నేపథ్యంలో..సహజంగానే తలెత్తే ఇలాంటి పలు సందేహాలకు ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాలు జవాబిస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 2 నెలల (డిసెంబర్, జనవరి)కు సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలను కంప్ట్రోలర్‌ అండర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ వివరాల ప్రకారం.. గత డిసెంబర్, జనవరి నెలలకు కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.28 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.

పన్ను రాబడులు, అప్పులు ఇలా..
పన్ను రాబడుల శాఖలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..ఎక్సైజ్‌ ఆదాయం  రెండు నెలల్లో  రూ.3,300 కోట్ల మేర సమకూరింది. జీఎస్టీ పద్దు కింద రూ.7,500 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,300 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.5,400 కోట్లు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో రూ.1,300 కోట్లకు పైగా ఇవ్వగా, అప్పుల కింద రూ.2,700 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. ఇక పన్నేతర ఆదాయం కింద రూ.1,048 కోట్లు వచ్చాయి. మొత్తం మీద 2023 నవంబర్‌ చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ పద్దు రూ. 1,49,316.41 కోట్లు ఉండగా 2024 జనవరి నాటికి రూ. 1,77,742.13 కోట్లకు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement