డీఎంకే కూటమికి బై..బై..! | - | Sakshi
Sakshi News home page

డీఎంకే కూటమికి బై..బై..!

Mar 23 2026 8:33 AM | Updated on Mar 23 2026 4:05 PM

-

 వేల్‌ మురుగన్‌ వెల్లడి 

డీఎంకేపై తీవ్ర ఆరోపణలు 

సందిగ్ధంలో సీపీఎం, కమల్‌ పార్టీ చర్చలు

డీఎంకే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు తమిళర్‌ వాల్వురిమై కట్చి నేత వేల్‌ మురుగన్‌ ప్రకటించారు. బయటకు వెళ్తూ డీఎంకేపై ఆరోపణల వర్షం కురిపిస్తూ, వన్నియర్లను ఆ కూటమికి దూరం చేసే ప్రయత్నంలో వ్యాఖ్యల తూటాలను పేల్చారు.

సాక్షి, చైన్నె : 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి తమిళర్‌ వాల్వురిమై కట్చి డీఎంకే కూటమిలో కొనసాగుతూ వస్తోంది. ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఓ స్థానంలో గెలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు వేల్‌ మురుగన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా కూడా ఆ పార్టీకి ఒక్క సీటు ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించింది. ఇందుకు వేల్‌మురుగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చర్చలకు ఆ పార్టీని డీఎంకే కమిటీ పిలవ లేదు. పలుమార్లు వ్యాఖ్యల తూటాలను పేల్చినా, అల్టిమేటం ఇచ్చినా డీఎంకే పట్టించుకోలేదు. దీంతో ఆదివారం చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేల్‌ మురుగన్‌ డీఎంకేను టార్గెట్‌ చేస్తూ తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆరోపణలు గుప్పించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుండి డీఎంకేతో కలిసి నడుస్తున్నామని గుర్తు చేశారు. తాజా ఎన్నికల కోసం జరిగిన చర్చల్లో డీఎంకే తమ కేవలం ఒకే సీటు కేటాయించిందన్నారు. దీనిని అంగీకరంచ లేమని, అదనపు స్థానాలు ఇవ్వాల్సిందేనని కోరినా పట్టించుకోలేదన్నారు.

10 అంశాల డిమాండ్లు
తమిళ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా 10 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. ఇందులో కుల గణన చేపట్టాలని, వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తమిళులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చే చట్టాన్ని తీసుకురావాలని కోరినట్టు వివరించారు. అయితే డీఎంకే ప్రభుత్వం తమ డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వంలోని కొందరు తమిళ వ్యతిరేక అధికారులు తనను కూటమి నుంచి బయటకు పంపించే కుట్ర పన్నినట్టు ఆరోపించారు. సీఎం స్టాలిన్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉండే అధికారులు అడ్డుపడుతున్నారని వివరించారు.

భవిష్యత్తు ప్రణాళిక
దేశాన్ని మతం పేరుతో విభజించే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో తాము చేరబోవడం లేదన్నారు. 10 అంశాల డిమాండ్లను అంగీకరించే పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం 25కు పైగా చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. డీఎంకే శ్రీపెద్దన్నశ్రీ పాత్ర పోషిస్తూ తమను విస్మరించిందని, అందుకే కార్యకర్తల అభిప్రాయం మేరకు కూటమి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా వేల్‌ మురుగన్‌ బయటకు వెళ్తుండటం గురించి డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ స్పందిస్తూ, బయటకు వెళ్లేటప్పుడు ఆరోపణలు చేయడం సహజమేనని వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌ నేత టీకేఎస్‌ ఇళంగోవన్‌ మాట్లాడుతూ, చర్చలకు చివరి క్షణంలో ఇచ్చే కొన్ని అవకాశాలు ఉంటాయని, అయితే, ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

సందిగ్ధంలో సీపీఎం
డీఎంకే కూటమి నుంచి వైదొలగుతున్న వేల్‌ మురుగన్‌ ప్రకటిస్తే, ఇదే కూటమిలోని సీపీఎం సందిగ్ధంలో పడి ఉంది. తాము ఆశిస్తున్న సీట్లను డీఎంకే ఇవ్వక పోవడంతో తీవ్ర అసంతృప్తితో సీపీఎం వర్గాలు ఉన్నాయి. గతంలో ఆరు సీట్లు ఇవ్వగా రెండు స్థానాలలో మాత్రమే సీపీఎం గెలవడంతో ఈసారి ఐదు సీట్లకు డీఎంకే పరిమితం చేసింది. ఇందుకు సీపీఎం అంగీకరించడం లేదు. ఆదివారం సీపీఎం ప్రధాన కార్యదర్శి షణ్ముగం నేతృత్వంలోని బృందం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమైంది. ఐదు సీట్లే అని తేల్చిచెప్పడంతో సీపీఎం సందిగ్ధంలో పడింది. 

ఈ భేటీ అనంతరం షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ, కూటమిలో ఈసారి కొత్తగా మరిన్ని పార్టీలు చేరడం వలన సీట్ల సర్దుబాటు సవాలుగా మారిందని సీఎం తమకు వివరించారన్నారు. 5 స్థానాలకు అంగీకరించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు షణ్ముగం తెలిపారు. అయితే తమకు ఆరు స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టామని, ఈ విషయంగా తమ పార్టీతో చర్చించి సోమవారం నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తమ తుది నిర్ణయా న్ని ప్రకటిస్తామని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు షణ్ముగం వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఇదే కూటమి లోని వీసీకే నేత తిరుమావళవన్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ సీట్ల సంఖ్య తగ్గింపు గురించి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇదే కూటమిలోని కమల్‌ మక్కల్‌ నీది మయ్యం సైతం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఆ పార్టీకి కేవలం రెండుసీట్లు ఇవ్వడానికి డీఎంకే ముందుకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇది కూడా డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతో పార్టీ వర్గాలతో కమల్‌ సుదీర్ఘ చర్చలలో ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement