సాక్షి, చైన్నె : తమిళనాడు శాసనసభలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆగస్టు 5న ఉదయం 10 గంటలకు ప్రవేశపెట్టనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ ప్రకటించారు. అలాగే ఆగస్టు 6వ తేదీన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. వివరాలు.. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం గత నెల తొలి అసెంబ్లీ సమావేశం జరిగింది. గవర్నర్ అర్లేకర్ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఆతదుపరి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టేందుకు కసరత్తులు చేపట్టారు. ఆ మేరకు గత మూడు వారాలకు పైగా సీఎం విజయ్ శాఖల వారీగా సమీక్షలలో బిజిగా ఉంటూ వస్తున్నారు. ఆర్థిక మంత్రి మరియా విల్సన్‌తో కలిసి ఆయా శాఖలలో సాగుతున్న పథకాలు, ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు నిధులు తదిత అంశాల గురించి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అలాగే, ఎన్నికల వాగ్దానాల అమలుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు సంబంధించిన కసరత్తులు చేపట్టారు.
ఆగస్టు 5న బడ్జెట్
ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశానికి ముహూర్తం కుదిరినట్టుగా తేదిని మంగళవారం అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.గ వర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆమోదం మేరకు సభా పర్వం నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఆగస్టు 5వ తేదిన మంత్రి మరియ విల్సన్ సభలో ఆర్థిక బడ్జెట్‌ను దాఖలు చేయనున్నారని తెలిపారు. మరుసటి రోజున 6వ తేదిన వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి వినోద్‌దాఖలు చేస్తారన్నారు. బడ్జెట్ దాఖలు తదుపరి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై బడ్జెట్‌పై చర్చ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తుందన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల వ్యవహారాలన్నీ పూర్తిస్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయని ప్రకటించారు. శాసనసభ్యులందరూ చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు శాంతియుతంగా విని సమాధానం ఇవ్వాలని స్పీకర్ కోరారు.
ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్టుపై స్పష్టత
ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్ సమాచారం తమకు అందిందని, అసెంబ్లీ వెలుపల జరిగే అరెస్టులకు స్పీకర్ ముందస్తు అనుమతి అవసరం లేదని, అయితే 24 గంటలకు మించి కస్టడీలో ఉంచితే సభకు సమాచారం అందిస్తామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ
సీఎం విజయ్ సైగల వివాదంపై స్పందన
ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన సైగల గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘సీఎం విజయ్ చేసిన సైగలలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేదని, అది రూల్స్ ప్రకారమే జరిగిందని స్పీకర్ మద్దతు తెలిపారు. ప్రతిపక్షాలు కూడా సైగలు చేయడానికి అనుమతి ఇస్తారా అని ప్రశ్నించగా ‘‘వారు ఏ సైగ చేయబోతున్నారో నాకు తెలిస్తే దానికి అనుమతి ఇవ్వాలా వద్దా ’’ అని నిర్ణయిస్తానని అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, అధికార ంలోకి వస్తే మహిళలకు రూ. 2500, అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం వంటి వాగ్దానాలు తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆచరణకు నోచుకునేనా అన్న ఎదురు చూపులు సర్వత్రా పెరిగాయి. తాజా సమావేశాలు వాడి వేడిగాజరిగే అవకాశాలు ఎక్కువే. డీఎంకే, అన్నాడీఎంకేలు అధికార టీవీకేతో ఢీ కొట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.


