సాక్షి, చైన్నె: చైన్నె నగరం పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ అధికారులుమంగళవారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తేనాం పేట లోని రవాణా శాఖలో డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన ధరణిదరన్ నివాసం , తురైపాక్కంలోని షిప్పింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న వ్యాపారవేత్త మురుగేశన్ ఆయన కుమారుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు.మనీలాండిరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. తనిఖీలు పూర్తి అయిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది.
8,193 దేవాలయ ట్రస్టీలకు దరఖాస్తుల ఆహ్వానం
కొరుక్కుపేట: హిందూ మత దేవాదాయ శాఖ నియంత్రణలో ఉన్న 8,193 ఆలయాల్లో ట్రస్టీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని హిందూ మత, దేవాదాయ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం జాబితాలో చేర్చిన 8,193 దేవాలయాలకు వంశపారంపర్య ట్రస్టీల నియామకం కోసం అర్హులైన వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరుతోంది .ఈ మేరకు ట్రస్టీల నియామక ప్రకటన, ఆలయ వివరాలు. అర్హతలు, దరఖాస్తు ఫారం (www.hrce.tr.gov.in) దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పూరించవచ్చు , అలాగే సంబంధిత పత్రాలతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు , పూర్తి చేసిన దరఖాస్తులను వ్యక్తిగతంగా, ఎక్స్‌ప్రెస్ మెయిల్ ద్వారా సంబంధిత జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయానికి పంపవచ్చని అధికారులు తెలియజేశారు.
బతికి ఉన్నంత కాలం పుట్టినరోజు వద్దు!
– వైగో ఉద్వేగం
సాక్షి, చైన్నె: ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తన పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు మంగళవారం భావోద్వేగ విజ్ఞప్తిని చేశారు. ఈ ఏడాది మాత్రమే కాకుండా, తాను జీవించి ఉన్నంత కాలం ఇక, తన పుట్టినరోజు వేడుకలను ఎవరూ జరుపుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితం పార్టీ నాయకులు, కార్యకర్తలు తన వద్దకు వచ్చి సెప్టెంబర్ 22న పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పట్టుబట్టారన్నారు. అయితే, వారి ఒత్తిడిని కాదనలేక అయిష్టంగానే అంగీకరించానని పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఏర్పాట్లు తన మనసులో తీవ్ర ఉద్వేగంతో మనశ్శాంతి లోపించడానికి కారణమవుతున్నాయన్నారు. ద్రవిడ సిద్ధాంతకర్త అన్నా ఆశయాలు, జయంతి ఉత్సవాలు మాత్రమే సెప్టెంబరు నెలలో జరగాలని సూచించారు. అయితే, ఈ ఏడాది వారు తయారు చేసిన వైగో 83 లోగోను ఎవరూ ఉపయోగించవద్దు అని సూచించారు. ఈ ఒక్క ఏడాదే కాదు, తాను బ్రతికి ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించకూడదని ఉద్వేగంగా వ్యాఖ్యలుచేశారు. ఆ రోజున తనను కలవడానికి ఎవరూ రాకూడదని, బ్యానర్లు, ఫ్లెక్సీలు లేదా పోస్టర్లు వేసి ప్రచారం చేయవద్దని కార్యకర్తలను కోరారు. పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాల ముందు తన వ్యక్తిగత వేడుకలు చిన్నవని స్పష్టం చేస్తూ, తాను తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించి తనకు మనశ్శాంతిని కలిగించాలని విజ్ఞప్తి చేశారు.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి..?
– ప్రభుత్వ తీరుపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వీధి కుక్కల సమస్య తీవ్రరూపం దాలుస్తున్నా దానిని అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకున్నట్లు కనిపించడం లేదని మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలను కాపాడటంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని అమలును పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల హైకోర్టులు సుమోటోగా కేసులను స్వీకరించి విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుమోటోగా కేసు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, దీనిపై నివేదిక సమర్పించాలని తమిళనాడు , పుదుచ్చేరి ప్రభుత్వాలను ఆదేశించింది. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుణ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. తమ నివేదిక సిద్ధంగా ఉందని, దానిని కోర్టులో సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ విజ్ఞప్తిని అంగీకరిస్తూ, తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసిన ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘రాష్ట్రంలో రోజూ వీధి కుక్కల కాటు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మేం నెలకు ఒకసారి నివేదిక ఇవ్వాల్సి ఉంది.’ అని వ్యాఖ్యలు చేశారు. కాగితాల్లో నివేదికలు సమర్పించడం వేరు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదని అసహ నం వ్యక్తం చేశారు. చివరికి హైకోర్టు ప్రాంగణంలో కూడా వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ఇప్పటికైనా జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు.


