సాక్షి,చైన్నె: తమిళనాడు విద్యాశాఖలో విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ వెల్లడించారు. ఇకపై విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువును తగ్గించడమే కాకుండా, విద్యాబోధనను ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారుస్తామని ఆయన తెలిపారు. అన్నా శత జయంతి స్మారక గ్రంథాలయంలో జరుగుతున్న పాఠ్యాంశాల తయారీ కమిటీ సమావేశంలో మంత్రి రాజ్‌మోహన్ మాట్లాడారు.
విద్యాసంస్కరణలు
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను కేంద్రంగా చేసుకుని విద్యను అందిస్తామన్నారు.. తల్లిదండ్రులను గౌరవించే విలువలతో కూడిన విద్యా విధానం అమల్లోకి వస్తుందన్నారు. పుస్తకాల బ్యాగుల బరువును గణనీయంగా తగ్గిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందన్నారు. విద్యార్థులకు కష్టంగా అనిపించే గణితాన్ని ఆసక్తికరమైన కథల రూపంలో బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల్లో అక్షరాల సంఖ్య తగ్గించి, రంగురంగుల చిత్రాలు పెంచుతామన్నారు. ఈ చిత్రాల వద్ద ఉండే క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అది వీడియో రూపంలో ప్లే అయ్యేలా సాంకేతికతను జోడిస్తున్నామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన
విద్యార్థులకు ఏఐ సాంకేతికతలకు సంబంధించిన మెళకువలను నేర్పిస్తామన్నారు. ఏఐ వలన్ల ఉద్యోగాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉపాధ్యాయులు కేవలం తమ అర్హత, ప్రతిభ ఆధారంగా మాత్రమే వ్యవస్థలోకి రాగలరనివివరించారు.. విద్యాశాఖలో అవినీతిని పూర్తిగా అరికడతామన్నారు. ప్రతి పాఠశాలలోనూ దినపత్రికలు చదివే అలవాటును ప్రత్యేకంగా ప్రోత్సహించబోతున్నామన్నారు.


