కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్‌ | Kerala New CM VD Satheesan, Know About His Political Journey And His Key Milestones In Telugu | Sakshi
Sakshi News home page

సతీశన్‌ ఆచరణాత్మక రాజకీయవేత్త

May 15 2026 5:04 AM | Updated on May 15 2026 10:49 AM

Kerala CM VD Satheesan political journey in key milestones

సీఎల్పీ నాయకుడిగా ఎంపిక  

కేరళ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ ప్రకటన  

అధిష్టానం నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిలో రమేశ్‌ చెన్నితాల!   

ఐయూఎంఎల్‌ ఒత్తిడితోనే సతీశన్‌ ఎంపిక  

క్షేత్రస్థాయిలో అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలు  

18న సీఎంగా ప్రమాణ స్వీకారం  

న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై 10 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తెరపడింది. సీనియర్‌ నేత వి.డి.సతీశన్‌కు సీఎం పీఠం కట్టబెట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం గురువారం నిర్ణయించింది. ఇప్పటిదాకా జరిగిన చర్చల ఆధారంగా సతీశన్‌ను కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్పి) నాయకుడిగా నియమించాలని నిర్ణయించినట్లు కేరళ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ వెల్లడించారు. 

ఆమె గురువారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పరిశీలకులు అజయ్‌ మాకెన్, ముకుల్‌ వాస్నిక్, సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7న తిరువనంతపురంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో.. రాష్ట్రంలో సీఎల్పికి కొత్త నాయకుడిని నియమించే విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూర్తి అధికారం కట్టబెడుతూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. 

అనంతరం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాం«దీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీతోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సహా పార్టీ ఎంపీలు, నేతలతో ఖర్గే విస్తృతంగా సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. సీఎల్పీ నాయకుడిగా సతీశన్‌ను నియమిస్తూ తుది నిర్ణయం తీసుకున్నట్లు దీపాదాస్‌ మున్షీ స్పష్టంచేశారు. పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని తేల్చిచెప్పారు.  

కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పార్టీ  
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 102 స్థానాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం కె.సి.వేణుగోపాల్, సతీశన్, రమేశ్‌ చెన్నితాల పోటీపడ్డారు. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, దాదాపు 10 రోజులపాటు ఢిల్లీలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ పెద్దలు ఎట్టకేలకు సతీశన్‌కే సీఎం పోస్టు అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఖర్గే, రాహుల్‌ గాంధీ 40 నిమిషాలపాటు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. గురువారం తుది నిర్ణయం వెలువడింది. 

నూతన కేరళను సృష్టిస్తాం: సతీశన్‌  
తనను సీఎంగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు సతీశన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకు అతిపెద్ద బాధ్యత అప్పగించిందని అన్నారు. కేరళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేరళ ప్రజలు పదేళ్ల వామపక్ష పాలనను అంతం చేశారని, ఎన్నో ఆశలతో తమకు అధికారం అప్పగించారని పేర్కొన్నారు. నూతన కేరళను సృష్టించడానికి, నూతన యుగాన్ని ప్రారంభించడానికి అంకితభావంతో పని చేస్తామని వెల్లడించారు. 

గురువాయూర్‌కు రమేశ్‌ చెన్నితాల!  
కేరళ సీఎం పదవిని ఆశించిన సీనియర్‌ నాయకుడు రమేశ్‌ చెన్నితాల గురువారం అధిష్టానం నిర్ణయం తెలిసిన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. తిరువనంతపురంలోని తన ఇంటి నుంచి గురువాయూర్‌ శ్రీకృష్ణ మందిరానికి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఐయూఎంఎల్‌ ఒత్తిడి పెంచడం వల్లే..  
కాంగ్రెస్‌ అధిష్టానం మద్దతు కె.సి.వేణుగోపాల్‌కు ఉన్నప్పటికీ సీఎంగా సతీశన్‌ను ఎంపిక చేయడం వెనుక ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో ప్రధాన భాగస్వామి అయిన ఐయూఎంఎల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లు గెల్చుకుంది. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

సీఎం పదవిని సతీశన్‌ను కట్టబెట్టాలని ఆ పార్టీ కాంగ్రెస్‌ పెద్దలపై గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సొంతంగా స్పష్టమైన మెజార్టీ లేని నేపథ్యంలో మిత్రపక్షమైన ఐయూఎంఎల్‌ ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. మరోవైపు మెజార్టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కె.సి.వేణుగోపాల్‌కు అండగా నిలిచారు. కానీ, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు సతీశన్‌కే జైకొట్టారు. క్యాడర్‌పై బలమైన పట్టుండడం ఆయనకు అనుకూలంగా మారింది. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం సతీశన్‌ను సీఎంగా ఎంపిక చేయక తప్పలేదు.  

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం  
సతీశన్‌ సహా కాంగ్రెస్‌ నేతలు గురువారం కేరళ గవర్నర్‌ ఆర్‌.వి.ఆర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్‌ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నెల 18న సతీశన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.     

సతీశన్‌ ఆచరణాత్మక రాజకీయవేత్త
వి.డి.సతీశన్‌.. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూనే, ప్రశాంతమైన శైలితో ప్రజలకు అందుబాటులో ఉండే నేత. కేరళ రాజకీయాల్లో దూకుడుగల ప్రతిపక్ష నేతగా ప్రతిష్టను పెంచుకున్నారు. 2021లో ఓటమి తర్వాత దశాబ్దకాలంగా పార్టీ పునరుజ్జీవనానికి కృషి చేశారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉద్భవించి, కేరళలోని అత్యంత బలమైన ప్రతిపక్ష నాయకులలో ఒకరిగా ఎదిగిన సతీశన్, తన రాజకీయ వ్యూహంతో ఆచరణాత్మక రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు.  

ప్రజాకర్షక నేతగా.. 
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి సారించారు. పినరయి విజయన్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. క్రమశిక్షణ కలిగిన నేతగా పేరుతెచ్చుకున్న సతీశన్‌.. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేకపోయినప్పటికీ, మీడియా వ్యవహారాలలో నేర్పరి. ఆయన శైలి.. వర్గపోరాటాలతో సతమతమవుతున్న పార్టీలో కొందరు సీనియర్‌ నాయకులను కలవరపెట్టింది. యువతను కాంగ్రెస్‌ వైపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 

దిగ్గజ నాయకులైన కె. కరుణాకరన్, ఎ.కె.ఆంటోనీ, ఊమెన్‌ చాందీల తర్వాత కాంగ్రెస్‌లో ప్రజలను ఆకర్షించే నాయకుడిగా ఎదిగారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమిని అధికారంలోకి తీసుకురాలేకపోతే రాజకీయ అజ్ఞాత వాసం చేస్తానని సంచలనాత్మక ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు, యూడీఎఫ్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక ధైర్యమైన ప్రకటన. సతీశన్‌ క్షేత్రస్థాయి విధానం, స్థానిక సమస్యలపై నిరంతర దృష్టి, పార్టీ వ్యవస్థను, ఓటర్ల విశ్వాసాన్ని పునరి్నరి్మంచడంలో తోడ్పడ్డాయి. కాంగ్రెస్‌లో ఏఐసీసీ కార్యదర్శి, కేపీసీసీ ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులలో పనిచేశారు.  

సాధారణ కుటుంబం నుంచి
1964 మే 31న ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కె.దామోదర మీనన్, తల్లి వి.విలాసిని అమ్మ. ఎర్నాకులంలోని సేక్రెడ్‌ హార్ట్‌ కాలేజీలో డిగ్రీ చేశారు. రాజగిరి కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో సోషల్‌ వర్క్‌ మాస్టర్స్‌ చదివారు. రాజకీయంలోకి రాకముందు ఆయన కేరళ హైకోర్టులో దాదాపు పదేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఆయన భార్య ఆర్‌.లక్ష్మీప్రియ. వారికి ఉన్నిమాయ అనే ఒక కుమార్తె ఉంది. సతీశన్‌ రాజకీయ ప్రస్థానం విద్యారి్థగానే మొదలైంది. కాంగ్రెస్‌ విద్యార్థి విభాగమైన కేఎస్‌యూ (కేరళ స్టూడెంట్స్‌ యూనియన్‌) ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) జాతీయ కార్యదర్శిగానూ పనిచేశారు.  

ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం
1996లో మొదటిసారి పరవూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2001 ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కేరళలో లెఫ్ట్‌ వేవ్‌ ఉన్నప్పుడూ తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత, రమేష్‌ చెన్నితల స్థానంలో హైకమాండ్‌ సతీశన్‌ను అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నియమించింది. అసెంబ్లీలో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత దూకుడును అవలంబించారు. అసెంబ్లీలో ఏదైనా మాట్లాడేప్పుడూ పూర్తి సమాచారం, పక్కా ఆధారాలతో మాట్లాడి బెస్ట్‌ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో, యూడీఎఫ్‌ ఉప ఎన్నికల విజయాలతో పాటు లోక్‌సభ ఎన్నికలలో బలమైన ప్రదర్శనతో ఇచ్చింది. పార్టీలోపల, బయటా వివాద రహిత నాయకుడిగా క్లీన్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement