కూటమి అరాచకాలను గుర్తుంచుకోవడానికి ‘వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్’ జిల్లాస్థాయిలో శిమ్మ రాజశేఖర్ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కమిటీ ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోనున్న కమిటీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
వేధింపులు.. బెదిరింపులు.. ఛీత్కారాలు.. అవమానాలు.. ఐదేళ్ల కూటమి పాలనలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఎదుర్కొన్న ప్రతి అన్యాయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకుంటోంది. అధికార పక్షం చేతిలో రెడ్‌బుక్ పట్టుకుని వికటాట్టహాసం చేస్తుంటే.. దాని కి సమాధానంగా ‘డిజిటల్ బుక్’కు వైఎస్సార్ సీపీ ఊపిరి పోస్తోంది. రాలిన ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పేందుకు, జరిగిన ప్రతి అవమానానికి బదులు ఇచ్చేందుకు ఇప్పటినుంచే కార్యాచరణ లిఖిస్తోంది. ఫొటోలు, వీడియోలు, ఎఫ్‌ఐఆర్ కాపీ లతో సహా ప్రతి ఆధారాన్ని నిక్షిప్తం చేయనుంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కక్ష సాధింపులకు బలవుతున్నారు. ప్రభుత్వం అక్రమ కేసులతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతోంది. కొందర్ని ఏకంగా జైళ్లకు పంపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిన, అసంతృప్తితో ఉన్న వారిని భయపెట్టో, బెదిరించో అణగదొక్కాలని సర్కారు చూస్తోంది. అందుకు పోలీసు, ఇతర యంత్రాంగాన్ని వాడుకుంటోంది. ఈ పరిస్థితుల్లో న్యాయపోరాటం చేస్తున్నా కక్ష సాధింపులు ఆగడం లేదు.
వైఎస్సార్‌సీపీ ఎదుర్కొన్న ఈ కక్ష సాధింపులకు సమాధానం చెప్పేందుకు పురుడు పోసుకున్నదే డిజిటల్ బుక్. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు.
040 49171718 టోల్ ఫ్రీ నంబర్‌ను విడుదల చేశారు. ఎవరు ఎక్కడి నుంచైనా తమ బాధలను చెప్పుకోవచ్చు. జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్‌లో నమోదు చేసుకోవచ్చు. ‘నేను ఒంటరిని కాను.. నా వెనుక నా నాయ కుడు ఉన్నాడు. నా బాధకు ఒక గుర్తింపు ఉంది’ అనేలా కార్యకర్త, నాయకుడు ధైర్యంగా ఉండేలా డిజిటల్ బుక్ సహాయపడుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తప్పు చేసిన వారు రిటైర్ అయినా, చట్టం ముందు నిలబడక తప్పదనే హెచ్చరికతో డిజిటల్ బుక్ ప్రస్థానం మొదలవుతోంది. అవసరమైన చోట బాధితులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, కోర్టుల్లో ప్రైవేటు కేసులు దాఖలు చేయడం వంటివి ప్రతిపక్ష పార్టీ చేస్తోంది.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో కూడా డిజిటల్ బుక్ అమలుకు జిల్లా పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా శిమ్మ రాజశేఖర్‌ను నియమించగా, సభ్యులుగా నర్తు నరేంద్రయాదవ్, పుట్టా మోహన్‌రెడ్డిల ను నియమించింది. ఈ కమిటీ ఈనెల 7వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కూడా చేసింది. వారితో పాటు జిల్లా నాయకులంతా డిజిటల్ బుక్ అమలుపై ప్రమాణం చేశారు. ఈ కమిటీ జిల్లా స్థాయిలో బాధితుల గోడును విననుంది. కూటమి ప్రభుత్వం వేధింపులు, దౌర్జన్యాలతో పాటు పోలీసు అధికారులు, ఇతర అధికారులను అనుసరిస్తున్న తీరుపై ఫిర్యాదులు తీసుకోనుంది. అలాగే, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయి లో స్థానిక నాయకులు కూడా క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డిజిటల్ కమిటీ దృష్టికి తీసుకురానున్నారు. వాటిని నిశితంగా పరిశీలించి, జెన్యూన్ అనుకున్న వాటిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టనున్నారు. ఇబ్బందులు పెడుతు న్న అధికారులతో మాట్లాడట మే కాకుండా డిజిటల్ బుక్‌లో ఎక్కించి, భవిష్యత్‌లో కార్యాచరణ అమలయ్యేలా చూడ నుంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పాల్గొంటోంది. ఆ తర్వాత మండల స్థాయి సమావేశాల్లో కూడా పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చేలా డిజిటల్ బుక్ ప్రాధాన్యతను శిమ్మ రాజశేఖర్ నేతృత్వంలోని కమిటీ వివరించనుంది.


