న్యూస్‌రీల్
పట్టుబడిన దొంగలుదేవాలయాల దొంగలు పట్టుబడ్డారు. బంగారం, వెండి రికవరీ చేశారు. –8లో
నా ప్రియాతిప్రియమైన భక్తులకు ఆశీస్సులు..
కాలం భాద్రపదంలోకి అడుగు పెట్టింది. మూషికుడు నా రథాన్ని సిద్ధం చేస్తున్నాడు. హిమగిరులపై నుంచి నేనూ అన్నీ చూస్తూనే ఉన్నాను.
మీరు మండపాలు కట్టడం.. నా ప్రతిమలు తయారు చేయడం.. పూజాదులకు ప్రణాళికలు వేసుకోవడం.. అన్నీ గమనిస్తూనే ఉన్నాను.
చవితి పూజకు జరిగే ప్రతి క్రతువూ నాకు సంతోషదాయకమే. నవరాత్రులు నన్ను పూజించేందుకు మీరు పడే తాపత్రయం సర్వదా నా హృదిని రంజింపజేస్తూనే ఉంటుంది.
మరి కాల మహిమో.. కలి మహిమో గానీ.. చవితి వేడుకలో కొన్ని పెడ ధోరణులు నన్ను కాస్త కలవరపరుస్తున్నాయి.
నా భక్తులకు నేను చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు.
నా మాతృమూర్తి నలుగుతో నన్ను తయారు చేసి ప్రాణం పోసింది. నా తండ్రి బూడిద రాసుకుని విహరిస్తారు. ఓ గుప్పెడు మారేడు దళాలను నా ముందు కడితే చాలు.. నేను పరవశుడినైపోతాను. కానీ భారీ అలంకరణల కోసం ఎక్కువ చందాలు వసూలు చేయడం, అవి చాలక నా భక్తులు తిప్పలు పడడం నాకు గొప్పగా అనిపించడం లేదు. మీరు గొడవలు పడి మరీ నాకు భారీ అలంకరణలు చేయాలా..? భక్తితో కట్టే చిన్న మండపంలోనైనా నేను సంతోషంగా కొలువుదీరుతాను. నా భక్తులు చందాల వసూలును దందాలుగా మార్చకపోతే చాలు.
నా ఈ గజవదనం నా తండ్రి నాకు ఇచ్చిన వరం. ఈ దేహాన్ని హేళన చేసినందుకే చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు. నన్ను అవతారా ల్లో చూసుకోవాలని నా భక్తులు ముచ్చటపడతారని నాకూ తెలుసు. కానీ మరీ సినిమా హీరోలకు నా రూపాన్ని అమర్చి.. దాన్ని భక్తి అంటే ఎలా చెప్పండి..? ఓ బుజ్జి ప్రతిమను తయారు చేసి నన్ను ఆవాహన చేసినా నేను వచ్చి వాలిపోతాను. ముప్పై అడుగులు, నలభై అడుగులు అంటూ మీ గొప్పలకు నా రూపాన్ని పెంచాల్సిన పనిలేదు.
వ్యాస మహర్షి భారతం చెబుతుంటే.. ఒంటి చేత్తో నేను రాసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. సాహిత్యమే కాదు సంగీతం అంటే కూడా నాకు ఎనలేని ఇష్టం. కానీ నా వేదికపై పెడుతున్న పాటలు వింటే చెవులు మూసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఉత్కృష్టమైన సాహితీ సంపదను నిలువెల్లా నింపుకున్న తెలుగు పాటలు మీకు కోకొల్లలుగా ఉన్నాయి. భారత భాగవతాదుల గానాలూ ఉన్నా యి. అవన్నీ కాదని అశ్లీల పాటలే నా మండపంలో వినిపించడం నేరం కాదు పాపం.
ఇక గంగమ్మ ఒడికి నన్ను చేర్చే అనుపు తంతు గురించి ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటు న్నాను. మన ఆనందానికి ఇతరులను బాధ పెట్టడం భావ్యమా చెప్పండి.. నా ముందు మీరు సంతోషంగా చిందులేస్తే చూసి నాకూ ముచ్చటేస్తుంది. కానీ పరిమితికి మించిన శబ్దానికి జనమంతా ఇబ్బంది పడుతుంటే.. నేనెలా సంతోషించగలను. డీజేలు పెట్టి ప్రాణాలతో చెలగాటమాడాల్సిన అగత్యం ఏముంది.
నా కథ మీ అందరికీ తెలుసు. నా పుట్టుక మీ అందరికీ పరిచయ మే. ఆ కథ మీకు ఏం నేర్పించింది. భక్తుడైనా సరే.. లోక విరుద్ధ పనులు చేసి గజాసురుడు ప్రాణా లు పోగొట్టుకున్నాడు. అందగాడైనా సరే హేళన చేసి చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు. మరెవరూ అలా చేయకూడదనే.. మీరు ఏటా మీకు నా కథ వినిపిస్తారు. ఈ హెచ్చరికలూ అందులో భాగమే. రసాయనాలను నీటిలో నింపే లోక విరుద్ధమైన పనులు మీరు చేయవద్దు..
నా గజవదనాన్ని చూసి నవ్వుకునే రీతిలో విగ్రహాలను రూపొందించవద్దు.
ఇప్పటికే ఎక్కడా వర్షాలు లేవు. చెరువులు ఎండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రంగుల హంగులకు పోకండి. మనస్ఫూర్తిగా మట్టి ప్రతిమతో ఆరాధించండి. అది చాలు నాకు. ఏటా పెరగాల్సింది నా విగ్రహం పొడవు కాదు. మీ బుద్ధి, మనసు. సుగుణాలను వికసింపజేయండి. సాటివారిని ప్రేమించండి. నన్ను నమ్మి ముందడుగెయ్యండి. మిమ్మల్ని నమ్మినోళ్లని వెనకడుగు వేయకుండా చూడండి. మట్టి రూపంలో మొక్కండి. పుడమితల్లిని పాడు చేసే పనులు మానండి.
సర్వేజనా సుఖీనోభవంతు..
ఇటు..
మీ గణేశుడు
– కాశీబుగ్గ


