శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 3,946 గణేష్ మండపాలకు సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు కోరుతూ నిర్వాహకులు దరఖాస్తులు చేసుకున్నారని.. ఇప్పటికి 2359 మండపాలకు అనుమతులిచ్చామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల ఆరంభంలో గానీ, నిమజ్జన, ఊరేగింపు ఆఖరి మజిలీలో గానీ డీజే వంటి సౌండ్ సిస్టమ్‌లకు అనుమతులు లేవని, ఇప్పటికే వీటి యజమానులకు నోటీసులు పంపామని, ఒకవేళ డీజేలు పెట్టారని తెలిస్తే తక్షణ మే సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని గూనపాలెం సబ్‌డివిజనల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఊరేగింపు నిమజ్జనం కార్యక్రమంలో మద్యం సేవించి డ్యాన్స్ చేస్తామంటే కుదరదని, ఆల్కహాల్ టెస్టులు జరుపుతామని, ఆ సమయంలో రెగ్యులర్‌గా ఉండే పెట్రోలింగ్, బీటు బృందాలతో పాటు ప్రత్యేక బృందాల నిఘా ఉంటుందన్నారు. మండపాల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవడం నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. జిల్లాకేంద్రంలోని నాగా వళి 2 వంతెనల వద్ద నిమజ్జన ప్రదేశాలను గుర్తించి 2 క్రేనులు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశామన్నారు. 1 నుంచి 5 అడుగుల విగ్రహాలు 487, 6 నుంచి 10 అడుగుల విగ్రహాలు 219, 15 అడుగుల విగ్రహాలు 31, 20 అడుగుల విగ్రహాలు 3 ఉండగా, 30 అడుగులు, 23 అడుగులు, 21 అడుగుల చొప్పున విగ్రహాలు ఒక్కొక్కటి నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు.


