నరసన్నపేట: స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన మూడేళ్ల బాలికను నరసన్నపేట పోలీసులు వారి తల్లిదండ్రులకు శనివారం సురక్షితంగా అప్పగించారు. రోజువారీ కూలి పనుల కోసం తల్లిదండ్రులు రవి బెహరా, కమలా బెహరాలు వెళ్లిపోగా కుటుంబ సభ్యుల వద్ద ఉన్న మూడేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటూ సమీపంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌కు నడుచుకుంటూ నాలుగు గంటల సమయానికి చేరుకుంది. చాలా సమయం వరకూ బాలిక కాంప్లెక్స్ పరిసరాల్లోనే తిరగడంతో స్థానికులు గుర్తించారు. 6 గంటల సమయంలో బాలికతో ఎవరూ లేనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ బి.గణేష్ పోలీసులను పంపారు. అనంతరం బాలిక వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. నాలుగు గంటల నుంచి బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురై వెతుకుతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలోగా పోలీసులే బాలికను అప్పగించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ మాట్లాడుతూ పిల్లలను ఇంటి వద్ద ఒంటరిగా వదిలేయకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


