టెక్కలి రూరల్: పరశురాంపురం కూడలి వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి మండలం చలమయ్యపేట గ్రామానికి చెందిన చెల్లూరి సంతోష్(29) తన స్నేహితులు సీహెచ్ కార్తీక్, బి.రామకృష్ణలతో కలిసి ద్విచక్రవాహనంపై చాకిపల్లి వద్ద ఉన్న దాబాకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా పరశురాంపురం కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి గుర్తు తెలియని కంటైనర్ లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు గాయపడటంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే సంతోష్ మృతిచెందారు. సంతోష్ కొన్ని నెలలు క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు. మృతుడి సోదరి కావ్య ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


