ఆర్టీసీ బస్సు ఢీకొని భర్త, కుమార్తె మృతి

- - Sakshi

శ్రీ సత్యసాయి: మేమిద్దరం మాకిద్దరంటూ ఆ దంపతులు ఆనందంగా గడిపేవారు. అందరూ ఉంటే ఆ ఇళ్లు ఆనందకాంతులతో వెలిగిపోయేది. బిడ్డల ముద్దుముద్దుమాటలు..భర్త ప్రేమానురాగాలతో ఆ ఇల్లాలు ఇంతకంటే ఇంకేమీ వద్దనుకునేది. కానీ ఆమెను చూసి విధికి కన్నుకుట్టింది. ఇంటిదీపాన్నీ, కంటి వెలుగునూ ఒకేసారి ఆర్పేసింది. ఆమె జీవితంలో చిమ్మ చీకట్లను మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..రొద్దం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫణీంద్రారెడ్డి (35), కావ్య దంపతులు. వీరికి కుమారుడు అఖిల్‌, కూతురు గౌతమి (4) సంతానం.

ఫణీంద్రారెడ్డి ‘కియా’లో కార్మికుడిగా పనిచేస్తుండగా, కావ్య పొలం పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కూతురు గౌతమికి జ్వరం రావడంతో చిన్నారికి వైద్యం చేయించేందుకు బుధవారం ఉదయం ఫణీంద్రారెడ్డి తన బైక్‌పై సమీపంలోని వెంకటాపురం (కర్ణాటక) బయలుదేరాడు. గ్రామ శివారులోని చెరువుకట్ట వద్దకు చేరగానే హిందూపురం డిపోకు చెందిన ఆర్డీసీ బస్సు ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఆ ఘటనలో ఫణీంద్రారెడ్డి, చిన్నారి గౌతమి అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వలిబాషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పదినిమిషాల క్రితం ‘బాయ్‌’ అంటూ ఆనందంగా చెప్పి వెళ్లిన కూతురు, భర్త నిర్జీవంగా కనిపించడం చూసి కావ్య కన్నీటి పర్యంతమైంది. రక్తపుమడుగులో పడి ఉన్న ఇద్దరినీ ఒడిలోకి తీసుకుని ఆమె రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించింది.

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top