బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిపివేత
మడకశిర: జిల్లా వ్యాప్తంగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీకి చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీలో 3,981, పోట్లమర్రి గ్రామ పంచాయతీలో 1,982, తాజాగా రామనపల్లి గ్రామ పంచాయతీలో 2,558 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన నేపథ్యంలో జిల్లా అధికారులు బర్త్, డెత్ రిజిస్ట్రేషన్ల యూనిట్లను పూర్తిగా బ్లాక్ చేశారు. జిల్లాలో 555 యూనిట్ల ద్వారా బర్త్,డెత్ జారీ అవుతున్నాయి. అయితే జిల్లాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం బయటికి రావడంతో ఈ యూనిట్లను జిల్లా అధికారి బ్లాక్ చేశారు.
క్షేత్రస్థాయిలో పక్షాళన
జిల్లాలో నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ కాకుండా వ్యవస్థను పక్షాళన చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఫార్మాట్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఫార్మాట్ ప్రకారం వివరాలు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ముఖ్యంగా ఏ పంచాయతీకి ఎవరు గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు, ఇన్‌చార్జ్ కార్యదర్శులుగా ఏయే గ్రామ పంచాయతీలకు ఎవరెవరు పని చేస్తున్నారు, ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, తదితర వివరాలను ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు నేరుగా వచ్చి జిల్లా యంత్రాంగానికి ఫార్మెట్ ప్రకారం వివరాలు అందించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివరాలన్నీ ఫార్మాట్‌లో పొందుపరచిన తర్వాతనే మళ్లీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిసింది.
కలెక్టర్ సమీక్ష
జిల్లాలో జరుగుతున్న నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై కలెక్టర్ శ్యాంప్రసాద్ కూడా సమీక్షించినట్లు సమాచారం. సంబంధిత అధికారులను తన కార్యాలయానికి పిలిపించుకుని ఈవ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. నకిలీ సర్టిఫికెట్ల బాగోతానికి చెక్ పెట్టాలని సదరు అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం.
జిల్లాలోనే మకాం వేసిన డీడీ
జిల్లాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం వరుసగా వెలుగులోకి వస్తుండడంతో రాష్ట్ర జనన, మరణ నమోదుశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు జిల్లాలోనే మకాం వేశారు. రెండో రోజైన మంగళవారం కూడా వివిధ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జారీ అయిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించారు. ఆయనతో పాటు జిల్లా బర్త్ అండ్ డెత్ నమోదు నోడల్ ఆఫీసర్ కళాధర్ కూడా వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆయన కదిరి మున్సిపాలిటీ, వివిధ గ్రామ పంచాయతీల కార్యాలయాలను వారు సందర్శించి పరిశీలన చేశారు. ఎక్కువగా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసిన గ్రామ పంచాయతీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.
రామాపురంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు
మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో అధికారులు తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే అగళి మండలం కొమరేపల్లి, బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామ పంచాయతీల లాగిన్‌లను హ్యాక్‌చేసిన కేటుగాళ్లు వేలాది నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారు. తాజా మరో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అగళి మండలంలోనే రామనపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి నాలుగు రోజుల వ్యవధిలోనే హ్యాకర్లు 2,558 నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
555 బర్త్, డెత్ రిజిస్ట్రేషన్ యూనిట్ల బ్లాక్
క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని పక్షాళన చేసిన తర్వాతే సర్టిఫికెట్ల జారీ


