సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధించేందుకు కృషి
ప్రశాంతి నిలయం: జిల్లాలో సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ‘ప్రశాసన్ గావ్‌కి ఓర్’పై జిల్లాస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ తదితరులు అధికారులు పాల్గొన్నారు.
శిల్పగురు అవార్డు గ్రహీతకు సత్కారం
తోలుబొమ్మల తయారీ కళారంగంలో విశేష కృషికిగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శిల్ప గురు అవార్డును ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలు బొమ్మల తయారీ కళాకారిణి డి.శివమ్మ ఈ మధ్యనే అందుకున్నారు. దీంతో మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్‌ను శివమ్మ శాలువాతో ఘనంగా సత్కరించారు.
మహిళలు వ్యాపార వేత్తలుగా రాణించాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి మహిళ వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మహిళా సంఘం సభ్యులకు సూచించారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో జిల్లా సమాఖ్య నాల్గవ వార్షిక మహాజన సభను జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా సమాఖ్య ఆడిట్ రిపోర్ట్, జమ ఖర్చులు, ఆదాయ వేయాలు, ఆస్తి పట్టిలను ముందు ఉంచి వాటిపై చర్చించి జిల్లా సమాఖ్య సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే 2025–26 మార్చి వరకు చేపట్టవలసిన కార్యక్రమాలను సభ్యలో చర్చించి ఆమోదించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతి మహిళా వ్యాపారావేత్తగా ఎదగాలని సూచించారు. డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, 32 మండలాల మండలాల అధికారులు, డీపీఎంలు, సీసీలు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.


