ఉద్యోగావకాశాలు సద్వినియోగం చేసుకోండి
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్తచెరువులోని శివసాయి డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించారు. మేళాకు 25 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి జాబ్‌మేళాను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించి 3000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. అనంతరం ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉద్యోగం సంపాదించుకొని మంచి మార్గంలో పయనించాలన్నారు. ఉద్యోగం ప్రతి మనిషికి గౌరవాన్ని అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ, సిడాప్ జేడీఎం సూర్యనారాయణతో పాటు కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.


