గోరఖ్‌పూర్(యూపీ): ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు.. తాగుబోతుల నిర్వాకాలు ఎటు పోతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రి పూట హాయిగా పిల్లాడితో కలిసి నచ్చింది వండుకుని తిందామనుకున్న ఆ ఇల్లాలికి పిడుగులా మీద పడ్డాడు తాగుబోతు భర్త. డ్రైవర్‌గా సంపాదించిందంతా తాగుడుకే నీళ్లగా ఖర్చయిపోగా ఆగమేఘాల మీద క్షణాల్లో చపాతి కావాలంటూ భీష్మించుకు కూర్చుని భార్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు. మెరుపువేగంతో చపాతి చేయకపోతే పిడిగు ద్దులు ఖాయమని హెచ్చరించి చివరకు అనుకున్నంత పనీ చేశాడు. భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడి రక్తం కళ్లజూశాడు. తాగుబోతు డ్రైవర్ నిర్వాకంపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్ నాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్‌లో ఒక్కటే చర్చ జరుగుతోంది. చపాతి ఆలస్యంగా చేసిందన్న చితకబాదుతాడా అంటూ అతడిని తిట్టిపోయని వాళ్లు లేరు. 30 ఏళ్ల భార్యామణి రాధికా సహానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భార్యాభర్తల చపాతి గొడవ ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాల్‌చంద్ సహానీ పూటుగా తాగి ఇంటికొచ్చాడు. లక్నోలో డ్రైవర్‌గా పనిచేయడం వచ్చిన డబ్బులు తాగుడకు తగలేయడం అతనికి దినచర్యగా తయారైంది. శనివారం రాత్రి ఇంటికి రాగానే ‘రోటీ రెడీ చెయ్’ అని హోటల్‌లో సర్వర్‌కు ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేశాడు. ఇంట్లో అంట్లు తోమడం వంటి ఇంటి పనులు ముగించుకుని రోటీలు చేసి ఇచ్చింది. రోటీ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా? అంటూ లాల్‌చంద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అప్పటికే వంటగదిలో పొయ్యి మీద వేడిమీదున్న పెనం తీసుకుని భార్యను చితక్కొట్టాడు. గొడవతో భయపడి అటుగా వచ్చిన తమ నాలుగేళ్ల కుమారుడి తల మీదా లాల్ చంద్ పెనంతో దాడి చేయడంతో తలకు గాయమై రక్తం ధారగా కారింది. దీంతో భయపడిపోయిన లాల్ చంద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
విషయం తెల్సిన ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. పారిపోతూ లాల్‌చంద్ భార్యను ‘నిన్ను చంపేస్తా’’ అంటూ అరుస్తూ పరుగెత్తాడని పొరుగువాళ్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తాగుబోతు భర్త కోసం గాలింపు మొదలెట్టారు. లాల్‌చంద్‌ను వెంటనే పట్టుకుని తగిన బుద్ధి చెప్తామని గోరఖ్‌నాథ్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిభూషణ్ రాయ్ చెప్పారు.
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్


