
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ‘పనిభారం’ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంటే.. మరోవైపు.. వెస్టిండీస్ పేస్ సంచలనం జేడన్ సీల్స్ (Jayden Seals) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn)పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.
202 పరుగుల తేడాతో పాక్ చిత్తు
కాగా వెస్టిండీస్ సొంతగడ్డ మీద మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడింది. తొలుత టీ20 సిరీస్‌లో పాక్ చేతిలో 2-1తో ఓటమిపాలైనన కరేబియన్లు.. వన్డే సిరీస్‌ను మాత్రం 2-1తో కైవసం చేసుకున్నారు. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో పర్యాటక పాక్‌ను ఏకంగా 202 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ మేర సిరీస్‌ను గెలుచుకుంది.
నలుగురిని డకౌట్ చేశాడు
ఈ విజయంలో జేడన్ సీల్స్‌ది కీలక పాత్ర. వెస్టిండీస్ విధించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు సీల్స్ చుక్కలు చూపించాడు. ఓపెనర్లు సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా షఫీక్‌లను డకౌట్ చేసిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. బాబర్ ఆజం (9), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (0)లను కూడా వెనక్కి పంపాడు.
అదే విధంగా.. టెయిలెండర్లు నసీం షా (6), హసన్ అలీ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 7.2 ఓవర్లు మాత్రమే బౌల్ చేసిన జేడన్ సీల్స్.. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి విండీస్‌కు ఏకపక్ష విజయం అందించాడు.
పాక్‌తో వన్డేలలో తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
ఈ క్రమంలోనే డేల్ స్టెయిన్ పేరిట ఉన్న రికార్డును జేడన్ సీల్స్ బద్దలు కొట్టాడు. 2012లో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో వన్డేల్లో స్టెయిన్ 39 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. సీల్స్ ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సీల్స్ ఆరు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటి రెండు, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ పడగొట్టడంతో.. 29.2 ఓవర్లలో కేవలం 92 పరుగులే చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా 202 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా 34 ఏళ్ల తర్వాత విండీస్ చేతిలో పాక్ వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భారత ప్రధాన పేసర్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడిపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి.
ఇక బుమ్రా తదుపరి ఆసియా కప్-2025 బరిలో దిగాల్సి ఉంది. అనంతరం స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్‌తో టెస్టుల్లో తలపడనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న జేడన్ సీల్స్ ఈ సిరీస్‌లో విండీస్‌కు కీలకం కానున్నాడు.
పాకిస్తాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే..
👉జేడన్ సీల్స్- వెస్టిండీస్- 6/18
👉డేల్ స్టెయిన్- సౌతాఫ్రికా- 6/39
👉తిసారా పెరీరా- శ్రీలంక- 6/44
👉కార్ల్ రాకెర్మాన్- ఆస్ట్రేలియా- 5/16
👉సౌరవ్ గంగూలీ- ఇండియా- 5/16.