
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలం గురించి టీమిండియా దిగ్గజ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో భారత ప్లేయర్ల కంటే విదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గుచూపుతాయని అంచనా వేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. ఐదుసార్లు చాంపియన్‌గా ఘనమైన రికార్డు ఉన్న చెన్నై జట్టు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.
వారిని వదిలేసేందుకు సిద్ధం
ఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే సహా వెంకటేశ్ అయ్యర్ వంటి వారిని వదిలించుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. సీఎస్‌కే సైతం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను విడిచిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇక అశ్విన్ సైతం సీఎస్‌కేను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో అశ్విన్ ఐపీఎల్-2026 మినీ వేలం గురించి మాట్లాడాడు. ‘‘ఈసారి మినీ వేలం జరుగబోతోంది. కాబట్టి ఇందులో భారత ఆటగాళ్లను మనం చూడలేమని చెప్పవచ్చు. కచ్చితంగా ఈసారి రేసులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు.
అంతేకాదు.. ఈసారి ఖరీదైన ఆటగాళ్లుగా విదేశీ ప్లేయర్లు నిలుస్తారు. ఏదేమైనా.. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే భారత్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ను విడుదల చేసింది అంటే.. అంతకంటే రిస్క్ మరొకటి ఉండదని చెప్పవచ్చు.
నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌లోకి రీప్లేస్‌మెంట్ ఆటగాడిగా వచ్చిన మిచెల్ ఓవెన్.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ వేలంకి వస్తారు. వీరికి భారీ ధర దక్కడం ఖాయం.
ముఖ్యంగా విదేశీ ఆల్‌రౌండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్‌లో అన్ని జట్లు రూ. 25. 30 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంది’’ అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే
👉రిషభ్ పంత్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 27 కోట్లు- 2025 వేలం
👉శ్రేయస్ అయ్యర్- పంజాబ్ కింగ్స్- రూ. 26.75 కోట్లు- 2025 వేలం
👉వెంకటేశ్ అయ్యర్- కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 23.75 కోట్లు- 2025 వేలం
👉మిచెల్ స్టార్క్- కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 24.75 కోట్లు- 2024 వేలం
👉ప్యాట్ కమిన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 20.50 కోట్లు- 2024 వేలం
👉సామ్ కరాన్- పంజాబ్ కింగ్స్- రూ. 18.50 కోట్లు- 2023 వేలం
👉కామెరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్- రూ. 17.50 కోట్లు- 2023 వేలం
👉బెన్ స్టోక్స్- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 16.25 కోట్లు- 2023 వేలం
👉క్రిస్ మోరిస్- రాజస్తాన్ రాయల్స్- రూ. 16.25 కోట్లు- 2021 వేలం
👉యువరాజ్ సింగ్- ఢిల్లీ డేర్‌డెవిల్స్- రూ. 16 కోట్లు- 2015 వేలం
👉నికోలస్ పూరన్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 16 కోట్లు- 2023 వేలం.
చదవండి: జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు