
జేడన్ సీల్స్. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌లో తరుచూ వినిపిస్తున్న పేరు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాదిలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ ఈ ఏడాదే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. సీల్స్ ఈ ఏడాది 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్‌ల్లో 88 వికెట్లు తీశాడు.
తాజాగా పాకిస్తాన్‌పై సంచలన ప్రదర్శనతో సీల్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్‌తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సీల్స్ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఫలితంగా పాక్ విండీస్ నిర్దేశించిన 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 92 పరుగులకే కుప్పకూలింది.
ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడు. సీల్స్ దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో డకౌటైన ఐదుగురు ఆటగాళ్లలో సీల్స్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. సీల్స్ బౌలింగ్‌లో పాక్ ఆటగాళ్లు బంతి బంతికి గండాన్ని ఎదుర్కొన్నారు. బంతిని వదిలేసినా సమస్యే, ఆడాలని ప్రయత్నించినా సమస్యే.
సీల్స్ ప్రదర్శనలు ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగాయి. పాక్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సీల్స్ వేసిన స్పెల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పెల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సంచలన ప్రదర్శనల అనంతరం సీల్స్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మరో పేసు గుర్రం వచ్చిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
విండీస్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటంచనుండగా సీల్స్‌పై ఫోకస్ మరింత పెరిగింది. వరల్డ్ క్లాస్ భారత బ్యాటర్లను అతను ఏ మేరకు నిలవరించగలడో అని చర్చలు మొదలయ్యాయి. సీల్స్ ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలోనూ హాట్ పిక్ అయ్యే అవకాశం ఉంది. అతడిని కేకేఆర్ తన్నుకుపోవచ్చు. ఎందుకంటే అతను కరీబియన్ లీగ్‌లో ఇదివరకే వారి సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు.
రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సీల్స్ విండీస్ తరఫున ఇప్పటివరకు 21 టెస్ట్‌లు ఆడి మూడు 5 వికెట్ల ప్రదర్శనలతో 88 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 31 వికెట్లు తీశాడు.