
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
హుస్సేన్ తలాత్ 31, హసన్ నవాజ్ 36 (నాటౌట్), సైమ్ అయూబ్ 23, అబ్దుల్లా షఫీక్ 26, మొహమ్మద్ రిజ్వాన్ 16, సల్మాన్ అఘా 9, మొహమ్మద్ నవాజ్ 5, షాహీన్ అఫ్రిది 11 (నాటౌట్) పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ డకౌటయ్యాడు.
విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. జెదియా బ్లేడ్స్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (45), రోస్టన్ ఛేజ్ (49 నాటౌట్), షాయ్ హోప్ (32), జస్టిన్ గ్రీవ్స్ (26 నాటౌట్) విండీస్ గెలుపులో తలో చేయి వేశారు. బ్రాండన్ కింగ్ (1), ఎవిన్ లూయిస్ (7), కీసీ కార్టీ (16) నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్ తలో 2 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనుంది.