హోప్‌ విధ్వంసకర శతకం.. ఆరేసిన సీల్స్‌.. 34 ఏళ్ల తర్వాత పాక్‌పై సిరీస్‌ గెలిచిన విండీస్‌ | West Indies Beat Pakistan By 202 Runs In 3rd ODI, Clinches The Series | Sakshi
Sakshi News home page

హోప్‌ విధ్వంసకర శతకం.. ఆరేసిన సీల్స్‌.. పాక్‌ను చిత్తుగా ఓడించిన విండీస్‌

Aug 13 2025 7:12 AM | Updated on Aug 13 2025 8:18 AM

West Indies Beat Pakistan By 202 Runs In 3rd ODI, Clinches The Series

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 1991 (34 ఏళ్లు) తర్వాత విండీస్‌కు పాక్‌పై ఇదే తొలి సిరీస్‌ విజయం. నిన్న జరిగిన సిరీస్‌ డిసైడర్‌లో విండీస్‌ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తొలుత కెప్టెన్‌ షాయ్‌ హెప్‌ విధ్వంసకర శతకంతో.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జేడన్‌ సీల్స్‌ సంచలన బౌలింగ్‌తో సత్తా చాటారు. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో పాక్‌, రెండో వన్డేలో విండీస్‌ గెలిచాయి.

భారతకాలమానం ప్రకారం నిన్న (ఆగస్ట్‌ 12) రాత్రి మొదలైన మూడో వన్డేలో విండీస్‌ పాక్‌ను 202 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. షాయ్‌ హోప్‌ విధ్వంసకర శతకంతో (94 బంతుల్లో 120 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విండీస్‌ భారీ స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డాడు.

అతడికి రోస్టన్‌ ఛేజ్‌ (29 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జస్టిన్‌ గ్రీవ్స్‌ (24 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు తోడయ్యాయి. 32 ఓవర్ల వరకు విండీస్‌ ఇన్నింగ్స్‌ చాలా నిదానంగా సాగింది. ఆ దశలో వారి స్కోర్‌ 118/4గా ఉండింది. అయితే ఆతర్వాత హోప్‌ గేర్‌ మార్చడం.. ఛేజ్‌, గ్రీవ్స్‌ మెరుపులు మెరిపించడంతో విండీస్‌ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. చివరి 18 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 176 పరుగులు పిండుకుంది.

చివరి ఓవర్లలో విండీస్‌ బ్యాటర్ల వీరంగం ధాటికి పాక్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. నసీం షా, హసన్‌ అలీ, మొహమ్మద్‌ నవాజ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నసీం షా, అబ్రార్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు.. సైమ్‌ అయూబ్‌, మొహమ్మద్‌ నవాజ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను జేడన్‌ సీల్స్‌ బెంబేలెత్తించాడు. సీల్స్‌ 7.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాక్‌ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌటయ్యారు. 30 పరుగులు చేసిన సల్మాన్‌ అఘా టాప్‌ స్కోరర్‌ కాగా.. హసన్‌ నవాజ్‌ (13), మొహమ్మద్‌ నవాజ్‌ (23 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ (9) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement