
న్యూఢిల్లీ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పట్ల దురుసుగా ప్రవర్తించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్కు (jayden Seales) ఐసీసీ షాకిచ్చింది.
మ్యాచ్ తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో సీల్స్ ఓవరాక్షన్ చేశాడు. ఫాలో త్రూ చేసే క్రమంలో బంతిని జైస్వాల్పైకి ప్రమాదకరంగా విసిరాడు. బంతి జైస్వాల్ ప్యాడ్స్‌పై బలంగా తాకింది.
దీన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ సీల్స్కు ఓ డీమెరిట్ పాయింట్ అలాట్ చేయడంతో పాటు అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.9 నిబంధన ప్రకారం ఓ ఆటగాడు బంతిని లేదా ఏదైన క్రికెట్ సమాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి కానీ వారి సమీపంలోకి కాని విసరకూడదు. ఇలా చేస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది.
సీల్స్ విషయంలోనూ ఇదే జరిగింది. పైగా సీల్స్ తాను చేసిన పనిని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని జైస్వాల్ పైకి విసరలేదని రిఫరీ పైక్రాఫ్ట్కు వివరించాడు. రనౌట్ చేసే ప్రయత్నంలో అలా జరిగిందని అన్నాడు. సీల్స్ వాదనను సైతం పరిగణలోకి తీసుకున్న ఐసీసీ పలుమార్లు సదరు సన్నివేశాన్ని పరిశీలించి, సీల్స్దే తప్పిదమని పేర్కొంది.
జైస్వాల్ అప్పటికే క్రీజ్లో ఉన్నా సీల్స్ అనవసరంగా బంతిని విసిరాడని నిర్దారించింది. అందుకే అతనికి ఓ డీమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజ్‌లో కోత విధించింది. 24 వ్యవధిలో సీల్స్కు ఇది రెండో డీమెరిట్ పాయింట్. ఈ మధ్యలో అతను మరో తప్పు చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదముంది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్‌బెల్ (87), షాయ్ హోప్ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్‌కు 3, ఛేజ్‌కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్