
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్(West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దుమ్ములేపుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
యశస్వికి ఇది 7వ టెస్టు సెంచరీ. జైశ్వాల్ 173 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి. క్రీజులో జైశ్వాల్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(20) ఉన్నాడు. అంతకుముందు యువ ఆటగాడు సాయిసుదర్శన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసిన సుదర్శన్.. తృటిలో తన తొలి టెస్టు సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు సుదర్శన్ దొరికిపోయాడు.
వీరిద్దరితో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్(38) రాణిచాడు. అయితే రాహుల్ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్-సాయిసుదర్శన్ రెండో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుదర్శన్ ఔటయ్యాక జైశ్వాల్ గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
ఇక విండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా తేలిపోయారు. కాగా తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్ మామూలుగా లేదు