
ఆసియాకప్-2025 ట్రోఫీ వివాదానికి ఇప్పటిలో ఎండ్‌కార్డ్ పడేలా లేదు. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరిగి దాదాపు వారాలు అవుతున్నప్పటికి ట్రోఫీ ఇంకా టీమిండియా చేతికి రాలేదు. ఈ ట్రోఫీ విషయంలో ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెనక్కి తగ్గడం లేదు.
ఇప్పటికే తన చేతుల మీదగానే ట్రోఫీ ప్రధానం చేయాలని మొండిపట్టుతో ఉన్నాడంట. కాగా ఆసియాకప్ ఫైనల్లో విజయం తర్వాత విన్నింగ్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత్ ఇష్టపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. ఏసీసీ చైర్మెన్ ఎవరంటే వారే ట్రోఫీని విజేతకు అందించాలి.
కానీ నఖ్వీ ఏసీసీ చీఫ్‌తో పాటు పీసీబీ చైర్మెన్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరిచింది. అతడికి బదులుగా యూఏఈ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్‌ల చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని భారత్ తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ ఒప్పుకోలేదు. తీసుకుంటే తన నుంచే తీసుకోవాలని పట్టుబట్టాడు.
టీమిండియా ప్లేయర్లు కూడా వెనక్కి తగ్గకుండా గ్రౌండ్‌లోనే కూర్చోవడం పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. దీంతో ఘోర అవమానంగా భావించిన నఖ్వీ.. స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విన్నర్స్ మెడల్స్‌ను తీసుకువెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. అయితే ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు నఖ్వీ అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు. ట్రోఫీ ఇంకా నఖ్వీ వద్దే ఉంది.
"ప్రస్తుతం ఆసియాకప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. అక్కడి అధికారులకు మొహ్సిన్ నఖ్వీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని అతడు సూచించాడు.
ఎప్పుడైనా కానీ భారత జట్టుకు లేదా బీసీసీఐకి ట్రోఫీ తనే అందజేస్తానని ఏసీసీ అధికారులకు నఖ్వీ చెప్పినట్లు" పీసీబీ చీఫ్ సన్నిహితుడు ఒకరు పిటిఐకు తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న సమావేశాల్లో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా