
రెండో టెస్టులో భారీస్కోరు దిశగా భారత్
తొలి రోజే క్లీన్‌స్వీప్‌నకు పునాది
తొలి ఇన్నింగ్స్‌లో 318/2
రాణించిన సాయి సుదర్శన్
రెండో టెస్టు తొలిరోజే... ఓపెనర్ యశస్వి జైస్వాల్ దృష్టి ద్విశతకంపై పడితే, భారత జట్టు అడుగులు క్లీన్‌స్వీప్‌పై పడ్డాయి. ఓవర్లు పడుతున్నా... బౌలర్లు అదేపనిగా మారినా... సెషన్లు పూర్తయినా... భారత బ్యాటర్ల ఆట మాత్రం మారనేలేదు. నిలకడగానే కొనసాగింది. జైస్వాల్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టాడు. ఇద్దరు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా చివరి టెస్టు మొదలైన రోజే అలవోకగా 300 పైచిలుకు పరుగుల్ని సాధించింది.
న్యూఢిల్లీ: తొలిటెస్టులో మూడు పదుల స్కోరుతో సరిపెట్టుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెడుతున్నాడు. సాయి సుదర్శన్‌తో చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జైస్వాల్ అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. అతని జోరు రెండో రోజు కొనసాగినా, లేదంటే సహచరుల్లో ఒకరిద్దరు రాణించినా టీమిండియా ఈ టెస్టులోనూ ఇన్నింగ్స్ విజయానికి అవసరమైన స్కోరును అవలీలగా చేస్తుంది.
ఇదే జరిగితే 1–0 ఆధిక్యంతో శుక్రవారం మొదలైన ఆఖరి టెస్టు చివరకు 2–0తో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయడం ఈ రోజే దాదాపు ఖాయమవుతుంది! ఏడు సార్లు టాస్‌కు వెళ్లిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలిసారి టాస్ గెలిచాడు. మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో... తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది.
యశస్వి జైస్వాల్ (253 బంతుల్లో 173 బ్యాటింగ్; 22 ఫోర్లు) అజేయ శతకం సాధించగా... సాయి సుదర్శన్ (165 బంతుల్లో 87; 12 ఫోర్లు) సెంచరీని చేజార్చుకున్నాడు. భారత్ కోల్పోయిన రెండు వికెట్లు విండీస్ స్పిన్నర్ జోమెల్ వారికెన్ ఖాతాలో చేరాయి.
శుభారంభంతో...
బ్యాటింగ్ మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) ఓపెనింగ్ వికెట్‌కు 58 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. క్రీజులో ఉన్నంత సేపు కాస్త దూకుడు ప్రదర్శించిన రాహుల్ అలాగే ఆడేందుకు యత్నించి వారికెన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో తొలి సెషన్‌లో జైస్వాల్‌కు సాయి సుదర్శన్ జతయ్యాడు.
గత టెస్టులో విఫలమైన సుదర్శన్ తాపీగా ఆడుతూ జైస్వాల్‌కు అండగా నిలిచాడు. దీంతో కరీబియన్ బౌలర్లకు ఈ సెషన్‌లో మరో సాఫల్యం సాధ్యమవలేదు. 94/1 వద్ద భారత్ లంచ్ విరామానికి వెళ్లింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ 100 పరుగులు దాటగా, యశస్వి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతనితోపాటు సుదర్శన్ కూడా క్రీజులో పాతుకుపోవడంతో భారత్‌కు పరుగులు, కరీబియన్‌కు కష్టాలు తప్పలేదు.
సగటున ఓవర్‌కు 3.5 పైచిలుకు రన్‌రేట్‌తో పరుగులు రావడంతో 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 150 దాటగా... కాసేపటికే సాయి సుదర్శన్ 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. భాగస్వామ్యం బలపడటంతో ఈ సెషన్‌లో వెస్టిండీస్‌కు వికెట్ భాగ్యమే కరువైంది. జైస్వాల్ 145 బంతుల్లో టెస్టుల్లో ఏడో శతకాన్ని పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. రెండో సెషన్ 220/1 స్కోరు వద్ద ముగిసింది.
ఆఖరి సెషన్‌లోనూ జోరు...
ఓపెనర్ జైస్వాల్, సుదర్శన్ ఇద్దరు పరుగులు చక్కబెడుతూ స్కోరు బోర్డును సాఫీగా లాగిస్తుండగా ఎట్టకేలకు ఈ సెషన్‌లో వెస్టిండీస్ శిబిరానికి కాస్త ఊరటగా ఒక వికెట్ దక్కింది. సెంచరీ దిశగా పరుగు పెడుతున్న సాయి సుదర్శన్‌ను వారికెన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జైస్వాల్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (68 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) జతయ్యాడు. ఈ జోడీ కూడా పాతుకుపోయిందే తప్ప ఏ దశలోనూ పడిపోలేదు. 82 ఓవర్లయ్యాక కొత్తబంతి తీసుకున్నారు.
కానీ ఓపెనర్ యశస్వి, కెప్టెన్ శుబ్‌మన్ ఆ బంతి ప్రయోజనాన్ని ఇవ్వకుండా క్రీజ్‌ను అట్టిపెట్టుకొని పరుగులు సాధించారు. యశస్వి 150 పరుగులు పూర్తి చేసుకొని డబుల్ సెంచరీపై కన్నేశాడు. ప్రత్యర్థి జట్టు రోజంతా కలిపి రెండే వికెట్లు తీసినా... మూడు సెషన్లలో 90 ఓవర్ల కోటా పూర్తి చేసిన విండీస్ బౌలర్లు ఒక్క వైడ్ గానీ, నోబాల్ గానీ వేయలేదు. దీంతో ఎక్స్‌ట్రాల రూపంలో భారత్‌కు ఒక్క పరుగైనా రాలేదు. స్కోరు బోర్డులో ఉన్న 318 పరుగులు బ్యాటర్లు బాదినవే! తొలిరోజు ఆట ముగిసే సరికి జైస్వాల్, గిల్ అజేయంగా నిలిచారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బ్యాటింగ్) 173; రాహుల్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) వారికెన్ 38; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్ 87; శుబ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (90 ఓవర్లలో 2 వికెట్లకు) 318. వికెట్ల పతనం: 1–58, 2–251. బౌలింగ్: సీల్స్ 16–1–59–0, ఫిలిప్ 13–2–44–0, గ్రీవెస్ 8–1–26–0, పియర్ 20–1–74–0, వారికెన్ 20–3–60–2, రోస్టన్ చేజ్ 13–0–55–0.