మార్కెట్లో కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలు దాటేసిన వెండి రేటు.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. ఈ రోజు (నవంబర్ 10) ఒకేసారి 4000 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.69 లక్షలకు చేరింది. ఈ తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు.
రాబర్ట్ కియోసాకి వెండి ధరలు పెరుగుతాయనే.. నేపథ్యంలో ట్వీట్ చేశారు. సిల్వర్ 50 డాలర్లు దాటేసింది. నెక్స్ట్ స్టాప్ 70 డాలర్లు అని వెల్లడించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు.. కియోసాకి చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు.
SILVER over $50.
Next stop $70?— Robert Kiyosaki (@theRealKiyosaki) November 10, 2025
భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా.. వెండిని కేవలం ఆభరణాలు, అలంకార సామాగ్రిగా మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ ఇప్పుడు కీలకంగా మారింది.
ఇదీ చదవండి: విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా..
వెండిని పారిశ్రామిక రంగాల్లో కూడా వినియోగిస్తున్న కారణంగా.. సిల్వర్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది లక్ష రూపాయల కంటే తక్కువ ధర ఉన్న వెండి.. నేడు రూ. 1.69 లక్షలకు చేరిందంటే.. దీనికి ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.


