ఒకప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవించి.. అప్పులపాలైపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అతి తక్కువ కాలంలో ప్రపంచ స్థాయి సేవలను అందించిన ఈ సంస్థ ఎందుకు కుప్పకూపీలిపోయింది?, విజయ్ మాల్యా ఎందుకు విదేశాలకు పారిపోయారు అనే విషయాలు చాలామందికి తెలుసుండక పోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు..
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
యూబీ గ్రూప్ బాస్ అయిన విజయ్ మాల్యా.. కింగ్‌ఫిషర్ బీర్, మెక్‌డోవెల్స్ అనే ప్రముఖ మద్యం బ్రాండ్స్ కూడా నిర్వహిస్తూ, రాజభోగాలు అనుభవించేవారు. 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో విమానయాన సేవలు ప్రారంభించారు. ఇది అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. విమానాల్లో లగ్జరీ సౌకర్యాలు, గ్లామర్ ప్రమోషన్స్, మోడల్-హోస్టెస్లతో.. ఎయిర్‌లైన్స్ గ్లామర్ బ్రాండ్‌గా నిలిచింది.
డెక్కన్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు
లగ్జరీ సౌకర్యాలు అందించడం వల్ల.. ఆపరేటింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో ఇంధన ధరలు పెరగడం.. జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి సంస్థలు తక్కువ ధరలకే టికెట్స్ విక్రయించడం వల్ల కింగ్‌ఫిషర్ నష్టాలను చూడాల్సి వచ్చింది. 2008లో డెక్కన్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయడం కూడా కంపెనీ(కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్)పై పెద్ద భారాన్ని మోపింది. దీంతో సంస్థలు ఆదాయం తగ్గిపోయింది. అప్పులు పెరిగిపోయాయి.
పెరిగిన అప్పు
2012 నాటికి విజయ్ మాల్యా సారథ్యంలో ఉన్న ఎయిర్‌లైన్ అప్పు ఏకంగా రూ. 9000 కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేకపోయారు. ఆదాయ మార్గాలు కనిపించలేదు. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కంపెనీ లైసెన్స్ రద్దు చేసింది. ఆ తరువాత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో.. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును చెప్పించలేకపోయారు. దీంతో విజయ్ మాల్యాపై బ్యాంక్ మోసం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక చేసేదేమీ లేక 2016లో భారతదేశం వదిలి యూకే వెళ్లిపోయారు. అయితే భారత ప్రభుత్వం ఈయనను మళ్లీ దేశానికి రప్పించడానికి ఎక్స్‌ట్రడిషన్ కేసు వేసింది.
ఇదీ చదవండి: 2019లో భర్తకు విడాకులు.. ఆరేళ్లుగా లక్షల కోట్లు విరాళం


