
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆహా, ఓహో అని కీర్తించే వారి మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పని అయిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సెంచరీ చేసి ఏకంగా 712 రోజులు గడిచింది. ఈ మధ్యలో అతను 71 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా మూడంకెల మార్కును తాకలేదు.
అడపాదడపా అర్ద సెంచరీలు చేసినా అవేవి అతని జట్టుకు అక్కరకు రాలేదు. అతను చివరిసారిగా 2023 ఆగస్ట్‌లో సెంచరీ చేశాడు. అది కూడా పసికూన నేపాల్‌పై. అప్పటి నుంచి రెండేళ్లు గడిచినా బాబార్ నుంచి ఒక్క సెంచరీ లేదు.
తాజాగా బాబర్ వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డకౌటై సొంత అభిమానులకే మరోసారి టార్గెట్ అయ్యాడు. ఎన్ని అవకాశాలు కావాలి రా బాబూ అంటూ అతని ఓన్ ఫ్యాన్స్ తలలు బాదుకుంటున్నారు.
ఒక దశలో బాబర్ ఫ్యాన్స్ అతన్ని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోల్చేవారు. ఇంకా చెప్పాలంటే బాబర్ విరాట్ కంటే చాలా మెరుగైన ఆటగాడని డప్పు కొట్టుకునే వారు. ఇప్పుడిప్పుడే వారి తెలిసొస్తుంది బాబర్ ఎంత ఘనమైన ఆటగాడో అని.
బాబర్ వయసు 30లు కూడా దాటకుండానే సుదీర్ఘకాలం ఫామ్ కోల్పోయి కెరీర్‌ను చరమాంకంలోకి తెచ్చుకున్నాడు. కొద్ది కాలంగా అతనికి పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో అవకాశాలు రావడం లేదు. టీ20 ఫార్మాట్‌లో అతని ఊసే లేదు. వన్డేల్లోనూ అడపాదడపా అవకాశాలే వస్తున్నాయి.
టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నా ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పసికూనలు జింబాబ్వే, నేపాల్, ఐర్లాండ్ లాంటి జట్లపై మాత్రమే అతను ప్రతాపం చూపిస్తుంటాడు. అందుకే అతనికి జింబాబర్ అని పేరు కూడా ఉంది.
ఇలాంటి జింబాబర్‌కు విరాట్ కోహ్లితో పోలిక ఏంటని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇంత చెత్తగా ఆడుతున్నా అతన్ని ఎలా భరిస్తున్నార్రా బాబూ అంటూ పాక్ అభిమానులపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న జట్లు కూడా వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లకు ఇన్ని అవకాశాలు ఇవ్వవని గుర్తు చేస్తున్నారు. బాబర్ ఇంకాస్త దిగజారక ముందే రిటైర్మెంట్ ప్రకటించడం మర్యాదగా ఉంటుందంటూ సలహా ఇస్తున్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా విండీస్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ (31), హసన్ నవాజ్ (36 నాటౌట్) గుడ్డి కంటే మెల్ల మేలన్నట్లు ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బాబర్ ఆజమ్ 3 బంతులు ఆడి డకౌటయ్యాడు.
అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (45), రోస్టన్ ఛేజ్ (49 నాటౌట్) విండీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనుంది.