IND vs NZ: ‘మనోడి’తో పాటు మరో ముగ్గురు.. గోల్డెన్‌ ఛాన్స్‌! | Adi Ashok to Josh Clarkson: Lesser Known players NZ ODI squad vs Ind | Sakshi
Sakshi News home page

IND vs NZ: ‘మనోడి’తో పాటు మరో ముగ్గురు.. గోల్డెన్‌ ఛాన్స్‌!

Dec 27 2025 5:24 PM | Updated on Dec 27 2025 5:43 PM

Adi Ashok to Josh Clarkson: Lesser Known players NZ ODI squad vs Ind

ఆది అశోక్‌

టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ దూరంగా ఉండగా.. అతడి స్థానంలో మైకేల్‌ బ్రేస్‌వెల్‌ సారథ్యం వహించనున్నాడు.

అయితే, టీ20 సిరీస్‌ సందర్భంగా సాంట్నర్‌ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఇక జనవరి 11- 31 వరకు కివీస్‌ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టు స్టార్లతో నిండి ఉండగా.. వన్డే జట్టులో కొత్త ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. ఆది అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, జోష్‌ కార్ల్‌సన్‌, జేడన్‌ లెనాక్స్‌ ఈసారి ఇండియా టూర్‌కు రానున్నారు.

ఆది అశోక్‌
భారత సంతికి చెందిన కివీస్‌ క్రికెటర్‌ ఆదిత్య అశోక్‌. తమిళనాడులో 2002, సెప్టెంబరు 5న జన్మించాడు. అశోక్‌ లెగ్‌ స్పిన్నర్‌. వైవిధ్య భరితమైన బంతులు వేయడంలో దిట్ట.

భారత సంతతికే చెందిన ఇష్‌ సోధి కెరీర్‌ చరమాంకానికి చేరుకుంటున్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అతడి వారసుడిగా కివీస్‌ బోర్డు అశోక్‌ను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికి న్యూజిలాండ్‌ తరఫున అశోక్‌ రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.

క్రిస్టియన్‌ క్లార్క్‌
దేశీ క్రికెట్‌లో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్టియన్‌ క్లార్క్‌ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌. ఇప్పటి వరకు అతడు కివీస్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.  అయితే, టీమిండియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 34 మ్యాచ్‌లు ఆడిన క్లార్క్‌ 52 వికెట్లు తీశాడు. అయితే, అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. 23 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 373 పరుగులు సాధించాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటర్‌గానూ రాణించగల సత్తా ఉన్న క్లార్క్‌ వైపు కివీస్‌ మొగ్గుచూపవచ్చు.

జోష్‌ క్లార్క్‌సన్‌
ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జోష్‌ క్లార్క్‌సన్‌.  లోయర్‌ ఆర్డర్‌లో ఫినిషర్‌గా రాణించగల సత్తా కూడా ఉంది. ఇప్పటికి 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్లార్క్‌సన్‌.. 92 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లలో అతడి పేరిట 2214 పరుగులు ఉన్నాయి.

జేడన్‌ లెనాక్స్‌
భారత పర్యటనలో భాగంగా ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 31 ఏళ్ల లెనాక్స్‌.. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 54 మ్యాచ్‌లలో కలిపి 69 వికెట్లు కూల్చాడు. ఎకానమీ 4.86. అతడి బౌలింగ్‌ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాంట్నర్‌కు వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు కాబట్టి.. లెనాక్స్‌ స్పిన్‌ విభాగంలో కీలకమయ్యే ఛాన్స్‌ ఉంది.

చదవండి: IND vs NZ: కివీస్‌ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీల​క ప్లేయర్లు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement