టీజీ టి20 ట్రోఫీ గెలుస్తాం
‘సాక్షి’తో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ పేరాల అమన్ రావు మెరుపు శతకంతో చెలరేగిపోయాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను చివరకు 48 బంతుల్లో 142 పరుగులు సాధించాడు. రాష్ట్ర స్థాయి లీగ్ పోటీల్లో అమన్‌దే వేగవంతమైన శతకం. అయితే దీంతో తాను సంతృప్తి చెందలేదని, మరో మూడు బంతుల ముందే సాధించాల్సిందని అతను అన్నాడు.
‘శతకానికి చేరువవుతున్న సమయంలో మరింత వేగంగా ఆడాల్సింది. నేను అనుకున్నదాని ప్రకారం 29 బంతుల్లోనే సెంచరీ రావాలి. కానీ కాస్త ఆలస్యం కావడంతో నేను నిరుత్సాహ పడ్డాను. అయితే మున్ముందు మరో అవకాశం వస్తే వదిలి పెట్టను’ అని గురువారం ‘సాక్షి’తో అమన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ తిలక్ వర్మ కూడా సెంచరీ చేయడంతో చివరకు వరంగల్ ఓటమి పాలైనా, అమన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. దూకుడుగా బ్యాటింగ్ చేయడమే తన శైలి అని, తొలి బంతి నుంచి చెలరేగడం అలవాటుగా మార్చుకున్నానని అమన్ చెప్పాడు.
‘కెరీర్ ఆరంభం నుంచి నేను ఇదే తరహాలో ఆడతాను. హైదరాబాద్ తరఫున దేశవాళీ మ్యాచ్‌లలో కూడా వేగంగా పరుగులు సాధించాను. ఇప్పుడు తెలంగాణ టి20 లీగ్‌లో దీనిని కొనసాగిస్తున్నా. మేం మెదక్‌తో మ్యాచ్ ఓడినా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం చూశాను. వారికి కావాల్సింది అదే. పైగా ఈ మ్యాచ్‌తో లీగ్‌లో సరైన ఊపు లభించిందని భావిస్తున్నా’ అని అమన్ రావు చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ బెంగాల్‌పై అద్భుత డబుల్ సెంచరీ చేయడం అమన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. 186 వద్ద నుంచి ఇన్నింగ్స్‌లో మిగిలిన చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 2, 6 బాది అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు.
‘వన్డే డబుల్ సెంచరీ నాకు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభ దశలోనే ఇలాంటి ఇన్నింగ్స్ రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే సీజన్‌లలో మరింత మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నా’ అని అతను వెల్లడించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌లో అమన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీనిపై నిరాశ చెందలేదని, తనదైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అతను వ్యాఖ్యానించాడు.
‘నా ప్రతిభను రాయల్స్ గుర్తించింది. అందుకే టీమ్‌లోకి తీసుకున్నామని హెడ్ కోచ్ సంగక్కర చెప్పారు. అయితే టీమ్ కాంబినేషన్ కారణంగా ఆడే చాన్స్ లభించలేదు. నిరాశపడవద్దని, మున్ముందు ఇదే జట్టుతో కొనసాగించి అవకాశాలు కల్పిస్తామని ఆయన నాకు ధైర్యం చెప్పారు. ఇది ఆరంభమే కదా. మున్ముందు ఐపీఎల్‌లో సత్తా చాటగలనని నమ్ముతున్నా’ అని అమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతిభాన్వేషణ బృందాలను ఆకట్టుకునేందుకు టీజీ టి20 మంచి చాన్స్ అని, కొత్త ఆటగాళ్లు దీనిని అందిపుచ్చుకోవాలన్న అమన్... వారియర్స్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు.
‘ఐపీఎల్‌లో తరహాలోనే టీజీ లీగ్ సాగుతోంది. సరైన సమయంలో మన రాష్ట్ర ఆటగాళ్లకు ఈ వేదిక లభించడం శుభపరిణామం. మా జట్టు రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించింది. పలువురు ప్రతిభావంతులతో టీమ్ పటిష్టంగా ఉంది. టీమ్ యాజమాన్యం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. తొలి సీజన్‌లో వరంగల్ వారియర్స్‌ను విజేతగా నిలపాలన్నదే నా లక్ష్యం’ అని అమన్ రావు చెప్పాడు.


