అండర్–16 ఆటగాడిగా ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు
లండన్: సీనియర్ క్రికెట్ అయిన ఐపీఎల్‌లో అతను ఎంతో మంది స్టార్ బౌలర్లను చితక్కొట్టవచ్చు గాక... తొలిసారి ఇప్పుడు భారత సీనియర్ జట్టులోనూ చోటు దక్కించుకోవచ్చు గాక... కానీ వైభవ్ సూర్యవంశీని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకా పసివాడిగానే గుర్తిస్తోంది. 16 ఏళ్లకంటే తక్కువ వయసు ఉండటంతో అతను ‘పెద్దల’ గదిలో భాగంగా ఉండరాదని సూచించింది. అందుకే వైభవ్ కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌ను కేటాయిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో బిహార్ జట్టు సభ్యుడిగా, ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడిగా ఇప్పటికే వైభవ్ టీమ్ డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఉన్నాడు.
‘వైభవ్ వయసు 16 ఏళ్లకంటే తక్కువ. ఇలాంటి ఆటగాళ్లకు తగిన భద్రత కల్పించే విషయంలో ఇంగ్లండ్ దేశంలోని చట్టాలను మేం అమలు చేస్తాం. అతను మ్యాచ్ జరిగేటప్పుడు లేదా టీమ్ మీటింగ్‌ల సమయంలో మాత్రం తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవచ్చు. అయితే దుస్తులు మార్చుకునే సమయంలో అతను అక్కడ ఉండరాదు. లేదా ఎవరూ లేని సమయంలో మార్చుకున్నా... ఇతర ఆటగాళ్లు వస్తే వెంటనే గదిని వీడాలి. అందుకే వైభవ్ కోసం అదనంగా మరో డ్రెస్సింగ్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని ఈసీబీ వెల్లడించింది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు జరిగే ఐర్లాండ్ సిరీస్‌కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. నిజానికి ఇవి ఐసీసీ నిబంధనలు. ద్వైపాక్షిక సిరీస్‌ల సమయంలో వీటిని పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఈసీబీ తమ ‘సేఫ్ హ్యాండ్స్’ విధానం ప్రకారం వైభవ్‌ను ప్రత్యేక ఆటగాడిగా చూస్తోంది. గతంలో ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ఆర్స్‌నల్ జట్టుకు చెందిన ఇద్దరు అండర్–16 ప్లేయర్లు ఏథన్ ఎన్‌వనరి, మ్యాక్స్ డోమన్‌కు కూడా ఇలాగే విడిగా ఉంచారు.
15 ఏళ్ల వైభవ్ వెంట అతని తల్లిదండ్రులను పంపించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రేపు ఐర్లాండ్‌తో జరిగే తొలి టి20లో అతను బరిలోకి దిగితే భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 91 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.


