
మల్టీ ఫార్మాట్ సిరీస్ (3 వన్డేలు, 2 టెస్ట్‌లు) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత అండర్ 19 జట్టు (India U19 Tour of Australia) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇదివరకే ఓ వన్డే గెలిచిన యువ భారత్ (India A vs Australia A).. తాజాగా రెండో మ్యాచ్ కూడా గెలిచి (51 పరుగుల తేడాతో), మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (68 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) యధావిధిగా విధ్వంసాన్ని కొనసాగించాడు. విహాన్ మల్హోత్రా (70), అభిగ్యాన్ కుందు (71) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) డకౌటై నిరాశపరిచాడు.
అనంతరం 301 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా యువ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 47.2 ఓవర్లలో 249 పరుగులకే చాపచుట్టేసింది. జేడన్ డ్రేపర్ (72 బంతుల్లో 107; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా ఆసీస్‌ను గెలిపించలేకపోయాడు. డ్రేపర్‌కు తోడుగా ఎవ్వరూ రాణించలేదు. అతనొక్కడే ఒంటరిపోరాటం చేశాడు.
బ్యాట్‌తో విఫలమైన యువ భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే బంతితో రాణించాడు. 4 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. కనిష్క్ చౌహాన్ 2, కిషన్ కుమార్, అంబ్రిష్, ఖిలన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.
ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులు చేయగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. వేదాంత్ త్రివేది (61 నాటౌట్), అభిగ్యాన్ కుందు (87 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్) ఆ మ్యాచ్‌లోనూ రాణించాడు.
ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే సెప్టెంబర్ 26న జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3 వరకు తొలి టెస్ట్.. అక్టోబర్ 7 నుంచి 10 వరకు రెండో టెస్ట్ జరుగనున్నాయి.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ