ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మరికొద్దిసేపట్లో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. లంక వేదికగా జరిగిన ట్రై సిరీస్‌లో శ్రీలంక-ఏతో జరిగిన ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్‌లో సంచనల ప్రదర్శనతో భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కుతుందా లేదా అనే సంగతి పక్కనబెడితే ఐర్లాండ్‌లో వైభవ్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే మతిపోతోంది.
డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20కి మలాహిడే స్టేడియం ఆతిథ్యమివ్వాల్సింది. కానీ అక్కడ మ్యూజిక్ కాన్సెర్ట్ ఉండడంతో మ్యాచ్ వేదికను బెల్‌ఫాస్ట్‌కు మార్చారు. అయితే ఈ స్టేడియం సామర్థ్యం 4వేల నుంచి 6వేల మధ్యే ఉంటుంది. అయితే ఇంత తక్కువ కె పాసిటీ ఉన్నప్పటికీ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడవ్వడం విశేషం. వైభవ్ ఆటను కళ్లారా చూసేందుకే టికెట్లు ఎగబడి కొన్నట్లు పలువురు పేర్కొన్నారు. అయితే మ్యాచ్‌ను డబ్లిన్‌లో కాకుండా బెల్‌ఫాస్ట్‌లో నిర్వహించడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు. ఇక ఐర్లాండ్‌తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.


