గౌరవ్‌ రెడ్డి విధ్వంసం.. నితీశ్‌ రెడ్డి ధనాధన్‌.. నల్గొండ భారీ స్కోరు | TG20 League 2026: Nitish Reddy Gourav Reddy Shines Nalgonda Score 259 | Sakshi
Sakshi News home page

గౌరవ్‌ రెడ్డి విధ్వంసం.. నితీశ్‌ రెడ్డి ధనాధన్‌.. నల్గొండ భారీ స్కోరు

Jun 26 2026 4:04 PM | Updated on Jun 26 2026 4:34 PM

TG20 League 2026: Nitish Reddy Gourav Reddy Shines Nalgonda Score 259

తెలంగాణ టీ20 లీగ్‌ (టీజీ20)- 2026లో భాగంగా నల్గొండ నైట్స్‌ భారీ స్కోరు సాధించింది. వరంగల్‌ వారియర్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 259 పరుగులు స్కోరు చేసింది.

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన వరంగల్‌ వారియర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ ఆదిలోనే ఓపెనర్‌ ప్రణవ్‌ సూర్యదేవర (4) వికెట్‌ కోల్పోయింది. అయితే, ఆరంభంలోనే వికెట్‌ తీసిన ఆనందం వరంగల్‌కు ఎక్కువ సేపు నిలవలేదు.

ఆకాశమే హద్దుగా
ఓపెనర్‌ గౌరవ్‌ రెడ్డితో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గౌరవ్‌ కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 

మరోవైపు.. నితీశ్‌ రెడ్డి 41 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు. వీరిద్దరు కలిసి ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మెరుపులు మెరిపించారు
అయితే, గౌరవ్‌ రెడ్డిని ముదస్సర్‌ అవుట్‌ చేయగా.. నితీశ్‌ రెడ్డి రనౌట్‌ అయ్యాడు. మిగితా వారిలో కెప్టెన్‌ రాహుల్‌ బుద్ధి (18 బంతుల్లో 31), అర్ఫాజ్‌ అహ్మద్‌ (14 బంతుల్లో 33) మెరుపులు మెరిపించగా.. దివేశ్‌ సింగ్‌ (7 బంతుల్లో 18 నాటౌట్‌) రాణించాడు. ఫలితంగా నల్గొండ నైట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది.

వరంగల్‌ బౌలర్ల ఆట తీరుపై విమర్శలు
కాగా వరంగల్‌ వారియర్స్‌ తమ తొలి మ్యాచ్‌లో భాగంగా మెదక్‌ ఫాల్కన్స్‌పై 258 పరుగులు చేసింది. అయితే, ఈ టార్గెట్‌ను కాపాడుకోలేక ఓటమి పాలైంది. తాజాగా నల్గొండకు ఏకంగా 259 పరుగులు లీక్‌ చేసింది. దీంతో వరంగల్‌ బౌలర్ల ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. 

ఇక నల్గొండతో మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌ బౌలర్లలో అబ్దుల్‌ మాలిక్‌ రెండు వికెట్లు తీయగా.. ముదస్పర్‌, శౌనక్‌ తలా ఒక వికెట్‌ తీశారు. టీమిండియా స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ వస్తేనే వరంగల్‌ బౌలింగ్‌ వైఫల్యాల నుంచి బయటపడగలదనిపిస్తోంది.

చదవండి: కెప్టెన్‌ సెంచరీ.. భారత్‌ స్కోరెంతంటే?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement