టీజీ20 లీగ్ 2026లో నల్గొండ నైట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్ 24) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కరీంనగర్ డైమండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో).
వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు.. నల్గొండ బౌలర్లు వరుణ్ గౌడ్ (2-0-8-3), రక్షణ్ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ్ ఖాన్ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది.
కరీంనగర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా ప్లేయర్లలో షరన్ (15), షుభమ్ శర్మ (20), హరిశ్ ఠాకూర్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం లక్ష్య ఛేదనకు ముందు వరుణుడు మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. ఛేదనలో నల్గొండ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా, నితీశ్ రెడ్డి (52), దివేశ్ సింగ్ (36 నాటౌట్) బాధ్యతాయుంగా ఆడారు.
నితీశ్ నల్గొండను గెలుపు తీరాలకు చేర్చిన తర్వాత ఔట్ కాగా.. దివేశ్, అర్ఫాజ్ ఖాన్ (6 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో 18 బంతులు మిగిలుండగానే నల్గొండ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.


