శభాష్‌ సౌమ్య... | Telangana girl shines in Indian Womens Football League | Sakshi
Sakshi News home page

శభాష్‌ సౌమ్య...

Apr 19 2025 2:11 AM | Updated on Apr 19 2025 2:11 AM

Telangana girl shines in Indian Womens Football League

భారత మహిళల ఫుట్‌బాల్‌ లీగ్‌లో మెరిసిన తెలంగాణ అమ్మాయి 

తొలిసారి ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు టైటిల్‌ దక్కడంలో కీలకపాత్ర

తొమ్మిది గోల్స్‌తో భారత్‌ నుంచి టాప్‌ స్కోరర్‌గా ఘనత  

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన ఇండియన్‌ ఉమెన్‌ లీగ్‌ (ఐడబ్ల్యూఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఈస్ట్‌ బెంగాల్‌ జట్టుకు తొలిసారి టైటిల్‌ దక్కడంలో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ కీలకపాత్ర పోషించింది. మిడ్‌ఫీల్డర్‌ పొజిషన్‌లో ఆడే సౌమ్య మొత్తం 9 గోల్స్‌ సాధించి ఐడబ్ల్యూఎల్‌ 2024–2025 సీజన్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 

ఈస్ట్‌ బెంగాల్‌కే చెందిన ఫాజిలా ఇక్వాపుట్‌ (ఉగాండా) 24 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఈస్ట్‌ బెంగాల్‌కే చెందిన ఎల్షాదాయ్‌ అచెమ్‌పోంగ్‌ (ఘనా) 10 గోల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో విదేశీ క్రీడాకారిణులు ఉండటంతో... తాజా ఐడబ్ల్యూఎల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన భారతీయ క్రీడాకారిణిగా సౌమ్య గుర్తింపు పొందింది.  ఈ ఏడాది జనవరి 10వ తేదీన మొదలైన ఈ లీగ్‌ ఏప్రిల్‌ 18న ముగిసింది. మొత్తం ఎనిమిది జట్లు డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఒక్కో జట్టుతో రెండుసార్లు చొప్పున తలపడ్డాయి. 

ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు నిర్ణీత 14 మ్యాచ్‌లు ఆడి 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు 12 మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఓవరాల్‌గా ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు 38 గోల్స్‌ చేసి, ప్రత్యర్థి జట్లకు 10 గోల్స్‌ సమర్పించుకుంది.  ఇప్పటి వరకు ఐడబ్ల్యూఎల్‌ ఎనిమిదిసార్లు జరగ్గా... గోకులం కేరళ జట్టు మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈస్టర్న్‌ స్పోర్టింగ్‌ యూనియన్, రైజింగ్‌ స్టూడెంట్స్‌ క్లబ్, సేతు క్లబ్, ఒడిశా ఎఫ్‌సీ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.  

రెండోసారి విజేత జట్టులో... 
నిజామాబాద్‌ జిల్లాలోని కూనేపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల సౌమ్య ఖాతాలో రెండోసారి ఐడబ్ల్యూఎల్‌ టైటిల్‌ చేరింది. సౌమ్య 2021–2022 ఐడబ్ల్యూఎల్‌ సీజన్‌ విజేత గోకులం కేరళ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. 2015లో భారత అండర్‌–14 జట్టుకు... 2016లో భారత అండర్‌–16 జట్టుకు ఆడిన సౌమ్య 2016 నుంచి 2018 వరక భారత అండర్‌–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2021లో భారత సీనియర్‌ మహిళల జట్టులోకి ఎంపికైన సౌమ్య ఇప్పటి వరకు ఓవరాల్‌గా 33 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఐదు గోల్స్‌ సాధించింది. 

2017లో ఇండియా రష్‌ సాకర్‌ క్లబ్‌ (ముంబై) తరఫున తొలిసారి ఐడబ్ల్యూఎల్‌లో బరిలోకి దిగిన సౌమ్య... 2019–2020 సీజన్‌లో కెంక్రె ఎఫ్‌సీ (ముంబై) తరఫున ఆడింది. 2021–2022 సీజన్‌లో గోకులం కేరళ జట్టుకు ఆడిన సౌమ్య 2022–2023లో క్రొయేషియాకు చెందిన డైనమో జాగ్రెబ్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించింది. క్రొయేషియా లీగ్‌లో ఆడిన తర్వాత తిరిగి వచి్చన సౌమ్య 2023–2024 ఐడబ్ల్యూఎల్‌లో మరోసారి గోకులం కేరళ జట్టు తరఫున బరిలోకి దిగింది.  

Advertisement
 
Advertisement
Advertisement