మహిళల టీ20 ప్రపంచకప్-2026లో న్యూజిలాండ్‌కు వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఘన విజయం సాధించింది. గత ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి విండీస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లిమ్మర్(8), కెప్టెన్ అమేలియా(5) ఆరంభంలోనే ఔటైనప్పటికి, బ్రూక్ హాలిడే(40), ఇసాబెల్లా గేజ్(39), మ్యాడీ గ్రీన్(35) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అల్లెన్ 4 వికెట్లతో సత్తాచాటింది.
అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ షెమైన్ కాంప్‌బెల్‌ది కీలక పాత్ర. కాంప్‌బెల్ కేవలం 62 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించింది.
ఆమె టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కావడం విశేషం.


