శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. భారత్- శ్రీలంక టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య సిరీస్‌లో ఆఖరి అనధికారిక వన్డే సిరిస్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్ సహాన్ అరాచిగే భారత స్టార్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతడిని టార్గెట్ చేయబోమని స్పష్టం చేశాడు. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.
ఇందులో శ్రీలంక విజయం సాధించగా.. ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్ కవ్వింపు చర్యలకు దిగగా.. వైభవ్ సూర్యవంశీ అతడి మీదకు దూసుకువెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అంపైర్ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు.
ఈ ఘటన నేపథ్యంలో లంక ప్లేయర్‌తో పాటు వైభవ్‌కూ మొట్టికాయలు పడ్డాయి. ఇక ఫైనల్‌లో ఇరుజట్లు మరోసారి తలపడనున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరు, అతడి ప్రవర్తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ఈ విషయం గురించి శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచిగే వద్ద స్పోర్ట్స్‌స్టార్ ప్రస్తావించగా.. ‘‘మా వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరు. మా ఆటను మేము ఆస్వాదిస్తున్నాము. సూపర్ ఓవర్ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజం. ఆటలో ఇలాంటివి సాధారణం’’ అని స్పష్టం చేశాడు.
ఇక భారత్‌తో ఫైనల్‌కు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న అరాచిగే.. ‘‘బ్యాటింగ్ విషయంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. మా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా జట్టు బాగుంది’’ అని పేర్కొన్నాడు. భారత్‌తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
కాగా లీగ్ దశలో తొలుత శ్రీలంకపై భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్‌లో లంక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్తాన్‌పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి.
చదవండి: శ్రీలంక ఫైనల్ చేరిందిలా!


