PC: SLC X
ముక్కోణపు సిరీస్‌లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్‌విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్‌డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్‌లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.
ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్‌డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్‌ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు.
అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్‌కు దంబుల్లా వేదిక.


