చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు | Smriti Mandhana Creates History, Becomes First Player In Men’s And Women’s Cricket To Hit 600 T20I Fours | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Jun 18 2026 9:44 AM | Updated on Jun 18 2026 10:36 AM

Smriti Mandhana Becomes 1st Male Or Female Cricketer In World To Achieve

భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల క్రికెట్‌లో ఇంత వరకు ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా భారత జట్టు బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే.

మంధాన, షఫాలీ మెరుపులు
లీడ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుపులతో హర్మన్‌ సేనకు శుభారంభం దక్కింది. స్మృతి 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 74 పరుగులు సాధించగా.. షఫాలీ 38 బంతుల్లో 10 ఫోర్లు బాది 55 పరుగులు చేసింది.

మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ (20) మాత్రమే ఓ మోస్తరుగా రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ మహిళా జట్టు 17.3 ఓవర్లలో కేవలం 114 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది.

చెలరేగిన బౌలర్లు
భారత ప్లేయర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లతో చెలరేగగా.. షఫాలీ వర్మ మూడు, నందినీ శర్మ రెండు, దీప్తి శర్మ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ 95 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

మంధాన ప్రపంచ రికార్డు
ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగానే స్మృతి తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 600 ఫోర్లు పూర్తి చేసుకుంది. తద్వారా పురుష, మహిళల క్రికెట్‌లో ఈ అరుదైన మార్కు అందుకున్న తొలి ప్లేయర్‌గా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు సాధించింది.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లు
👉స్మృతి మంధాన (ఇండియా)- 604 ఫోర్లు
👉సూజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌)- 521 ఫోర్లు
👉చమరి ఆటపట్టు (శ్రీలంక)- 493 ఫోర్లు
👉బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- 477 ఫోర్లు
👉బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)- 459 ఫోర్లు
👉పాల్‌ స్టిర్లింగ్‌ (ఐర్లాండ్‌)- 449 ఫోర్లు.

చదవండి: డబుల్‌ సెంచరీ చేసేవాడినే.. కానీ: గిల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement