
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (Ajinkya Rahane)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ హైదరాబాదీ బౌలర్‌కు కోపం కాస్త ఎక్కువేనని.. అయితే, అది అతడిలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసేంత వరకు చల్లారదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తనకు ఆలస్యంగా బంతిని ఇచ్చినందుకు తనపై సిరాజ్ కోపంగా ఉండేవాడంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ..
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిరాజ్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఓవైపు పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పనిభారం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. మరోవైపు సిరాజ్ మాత్రం సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ముఖ్యంగా చావోరేవో తేల్చుకోవాల్సిన ఐదో టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి టీమిండియాను గెలిపించాడు సిరాజ్. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో 23 వికెట్లు కూల్చాడు. అయితే, ఇక్కడా ఆట మధ్యలో యాంగ్రీ యంగ్‌మేన్‌లా సిరాజ్ దూకుడుగా కనిపించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో సవాల్ విసరుతూ అభిమానులకు కనువిందు చేశాడు.
సిరాజ్ నాపై కోపంగా ఉండేవాడు.. ఇప్పటికీ అంతే
ఈ నేపథ్యంలో సిరాజ్ పట్టుదల, దూకుడు గురించి టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘంగా బౌలింగ్ చేయడానికి సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆస్ట్రేలియాలో తను అరంగేట్రం చేస్తున్న సమయంలోనూ అంటే.. 2020-21 సిరీస్‌లో కూడా అతడు అదే ఇంటెన్సిటీతో ఉన్నాడు.
అయితే, నేను అతడిని ఆలస్యంగా బరిలోకి దించేసరికి నాపై కోపంగా ఉన్నాడు. ఇప్పటికీ అదే కోపం అతడి లోపల అలాగే ఉంది. అయితే, ఇది మహ్మద్ సిరాజ్‌లోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసేందుకు కారణమయ్యే కోపం అన్నమాట.
ఇంగ్లండ్ సిరీస్‌లో అతడి దూకుడైన బౌలింగ్ చూశాం కదా! తొలి బంతి నుంచి ఆఖరి బాల్ దాకా అదే నాణ్యతతో బౌలింగ్ చేస్తాడు. అందరికీ ఇది సాధ్యం కాదు. జేమ్స్ ఆండర్సన్ మాదిరే సిరాజ్ కూడా తొలి బంతి నుంచే దూకుడు కనబరుస్తాడు.
ఇంగ్లండ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరైన మ్యాచ్‌లలో సిరాజ్ పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.
2-2తో సమం
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో ఓడిపోయింది. బర్మింగ్‌హామ్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన గిల్ సేన.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది.
చదవండి: IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. మీ సంకుచిత బుద్ధి మారదా?