source: X
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా నిన్న జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని పరాజయం ఎదురుకావడం అటు ఆటగాళ్లను, ఇటు అభిమానులను షాక్‌కు గురి చేసింది.
విండీస్ బ్యాటర్లు అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి అజేయ శతకంతో తన జట్టును గెలిపించుకున్న తీరు అద్వితీయం. విండీస్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఈ ఒక్క విజయం ఆ జట్టుకు టీ20 సిరీస్‌కు ముందు మంచి బూస్టప్ ఇచ్చింది.
మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అయిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ.. సిరీస్ గెలిచినా, జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టుగా తాము ఇంకొన్ని అంశాల్లో మెరుగుపడాల్సి అవసరం ఉందని అన్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్‌లో లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు.
“మేము చాలా అంశాల్లో మంచి పురోగతి సాధించాం. అయితే ఇంకా కొన్ని విషయాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము సాధించిన స్కోరుతో సంతోషంగా ఉన్నాను. మ్యాచ్ మా నియంత్రణలోనే ఉండింది. కానీ చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, తేమ ఎక్కువగా ఉండటం వల్ల పరిస్థితులు మారిపోయాయి” అని చెప్పాడు.
కుల్దీప్ యాదవ్‌ను ముందుగానే బౌలింగ్‌కు ఎందుకు తీసుకురాలేదన్న ప్రశ్నపై స్పందిస్తూ.. మ్యాచ్ చివరి వరకు వెళ్తుందని మాకు తెలుసు. కుల్దీప్ వికెట్లు తీసే బౌలర్. అందుకే అతని రెండు ఓవర్లను చివర్లో ఉపయోగించాలనుకున్నానని వివరించాడు.
ఆరేడు క్యాచ్‌లు జారవిడిచాం
గత కొన్ని మ్యాచ్‌లుగా మా ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్టు లేదు. సిరీస్‌లో మొత్తంలో ఆరేడు క్యాచ్‌లు వదిలేశాం. ఇది మంచి సంకేతం కాదు. వరల్డ్‌కప్‌కు ముందు మా ఫీల్డింగ్ అత్యుత్తమ స్థాయిలో ఉండాలని చెప్పాడు.
డెత్ ఓవర్ల బౌలింగ్‌లోనూ స్పష్టత అవసరం
డెత్ ఓవర్ల బౌలింగ్‌లోనూ స్పష్టత అవసరమని గిల్ అభిప్రాయపడ్డాడు. “కొన్నిసార్లు డెత్ ఓవర్లలో అటాక్ చేస్తున్నామా, డిఫెండ్ చేస్తున్నామా అనే విషయంలో స్పష్టత ఉండటం లేదు. ప్రత్యర్థి ఐదు లేదా ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలనే విషయంలో కూడా సందిగ్ధత ఉంటుంది. డెత్ బౌలింగ్‌ను చాలా ముందుగానే ప్రారంభించాలా, లేక మిడిల్ ఓవర్ల తరహాలోనే కొనసాగించాలా అనేది స్పష్టంగా ఉండాలి. ఈ అంశాల్లో మేం కచ్చితంగా మెరుగుపడాలి” అని పేర్కొన్నాడు.
అంతకంటే ఎక్కువ చేయగలనని అనిపించడం లేదు
తక్కువ స్కోరుకే ఔటవ్వడంపై గిల్ స్పందిస్తూ.. “త్వరగా ఔటైతే నిరాశగానే ఉంటుంది. కానీ ఈ రోజు నేను ఔటైన బంతికి అంతకంటే ఎక్కువ చేయగలనని అనిపించడం లేదు” అని అన్నాడు.
ఇదీ చదవండి: విండీస్‌ను గెలిపించిన హోప్


